ఒక పెత్తందారు కన్నెర్ర చేయటం వల్లనో, ఒక ఉన్నతాధికారి కక్షబూనటం వల్లనో, లేదా వ్యవస్థలు ఏకమై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడం వల్లనో జైళ్లలో మగ్గి చివరకు నిర్దోషులుగా విముక్తులవుతున్నవారికి ఊరటనిచ్చే అంశమిది. అలాంటివారికి నష్టపరిహారం చెల్లించేందుకు అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించటం, ఏళ్ల తరబడి వారు జైలు పాలవటం మన దేశంలో ఎప్పటి నుంచో రొటీన్‌గా సాగిపోతోంది. నిందితులు నిర్దోషులని తేలినప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తు చేసినవారినీ, ప్రాసిక్యూషన్‌నూ తప్పుబట్టడం తరచూ కనబడుతుంది.
కానీ అందువల్ల ఒరిగేదేమిటి? సమాజం వారిని అమాయకులుగా, సాధారణ పౌరులుగా పరిగణించి ఆదరిస్తుందా? అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో అలాంటివారు నష్టపరిహారం పొందేందుకు నిబంధనలున్నాయి. అమెరికాలో జైల్లో మగ్గిన కాలానికి ఏడాదికి 50,000 డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తారు. బ్రిటన్‌లో దీర్ఘకాలం జైల్లో ఉన్న నిర్దోషులకు 10 లక్షల పౌండ్లు ఇస్తారు. జర్మనీలో ఇది రోజుకు 75 యూరోలు. మన దేశంలో అభాగ్యులు కేసుల నుంచి విముక్తి పొందటమే అదృష్టమన్నట్టు సరిపెట్టుకుంటున్నారు. పరిహారం సంగతలా ఉంచి వారికి ప్రభుత్వం నుంచి క్షమాపణైనా దక్కటం లేదు. శిక్ష పడుతున్న కేసులు మన దేశంలో ఏటా సగటున 54 శాతం మించటం లేదన్న గణాంకాల్ని గమనిస్తే ఇలాంటి అభాగ్యులెందరో అర్థమవుతుంది.
పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు భావించిన కేసు పూర్వాపరాలు చూస్తే ఈ నిర్ణయం ఎంత సరైందో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2013లో ఒక మైనర్‌పై అత్యా చారం చేసి హతమార్చాడన్న కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతూ, 2019లో ఉరిశిక్ష పడిన నిరుపేద పౌరుడి కథ ఇది. ఆయన పన్నెండేళ్ల కారాగారవాసంలో ఆరేళ్లు ఉరికంబం నీడన బతుకీడ్చాడు. అతణ్ణి అన్యాయంగా ఇరికించారనీ, దర్యాప్తు మొత్తం తప్పులతడకనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది ఇంతవరకూ ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. నిజానికి 2014లోనే ఒక కేసులో తీర్పునిస్తూ క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలితే దర్యాప్తు అధికారుల్ని బాధ్యులుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అది ఏ మేరకు అమలవుతున్నదో అనుమానమే.
అమాయకులపై తప్పుడు కేసులు బనాయించటం వల్ల అనేక విధాల నష్టం. నిజమైన దోషులు తప్పించుకు తిరుగుతూ అవే నేరాల్ని పదే పదే చేస్తుంటారు. అమాయక పౌరులు నిస్సహాయంగా జైల్లో మగ్గుతారు. దోషులు తప్పించుకు తిరుగుతున్నా, చేయని నేరానికి నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నా ప్రజలకు చట్టబద్ధ పాలనపై విశ్వాసం పోతుంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కుకూ, వ్యక్తి స్వేచ్ఛకూ పూచీ పడుతున్నా దానికి అనుగుణంగా అక్రమ కేసుల వల్ల జైలు పాలైనవారికీ, ఆలస్యంగా న్యాయం దక్కినవారికీ పరిహారం చెల్లించే చట్టాలు లేవు. జీవితంలో విలువైన కాలాన్నీ, స్వేచ్ఛనూ, పరువు మర్యాదలనూ కోల్పోయి మానసి
కంగా కుంగిపోయినవారికి పరిహారం పొందే హక్కుండి తీరాలి. మానవీయ దృక్పథంతో న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో పరిహారానికి ఆదేశిస్తున్నాయి. బాధితులందరికీ న్యాయం జరగాలంటే తగిన చట్టం అవసరం.
తొంభై శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరికొందరు తప్పుడు కేసుల పర్యవసానంగా పదేళ్లు కారాగారంలో మగ్గటం, చివరకు నిర్దోషులుగా విడుదల కావటం ఇటీవలి వైనం. విడుదలైన కొన్నాళ్లకే ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపిస్తూ 17 మందిపై దేశద్రోహ నేరంతో సహా పలు కేసులు పెట్టగా ఆరేళ్ల తర్వాత నిర్దోషులుగా బయటపడ్డారు. గూఢచర్యం, దేశద్రోహం కేసుల్లో ఇరుక్కున్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ రూ. 50 లక్షల పరిహారం పొందటానికి రెండు దశాబ్దాలు పట్టింది. ఇలాంటి పోకడలు ఆగాలంటే, తప్పుడు కేసుల పర్వానికి తెరపడాలంటే పరిహారం చెల్లించే విధానం రావాల్సిందే!


