ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు దక్షిణ కొరియాలోని బూసాన్‌లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.
దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్‌లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు.
ఈ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది.
ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్‌పింగ్‌లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్‌తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.
ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్‌విడియా కంపెనీ చిప్‌లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్‌వెల్ చిప్‌ల విషయం చర్చకు రాలేదంటున్నారు.
అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్‌ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్‌ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్‌పింగ్‌తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు.
దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్‌లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


