సరిగ్గా పదమూడేళ్ల తర్వాత దేశ రాజధాని నగరంపై ఉగ్రవాదం పంజా విసిరిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన సోమవారం నాటి ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉన్నా, దాని తీరుతెన్నులు గమనిస్తే అది ఆత్మాహుతి దాడే కావొచ్చనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీని వెనక కుట్ర
ఉండొచ్చని చెప్పడం గమనించదగ్గది.
గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి, 2,913 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం... ఆ సంగతిని ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ పేలుడు ఘటన సంభవించటం గమనిస్తే వీటిమధ్య పరస్పర సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అరెస్టయిన ఉగ్రవాదుల్లో తమ సహచర వైద్యులు ముగ్గురున్న సంగతి తెలిశాక పోలీసుల చక్రబంధం నుంచి తప్పించుకుని పరారవుతూ కావాలని ఆత్మాహుతి దాడికి దిగారా, లేక మరో లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వెళ్తుండగా అనుకోకుండా పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం పేలుడు తీవ్రతను చాటుతోంది. తమ చర్యల ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించటం, అందుకోసం జన సమ్మర్దం గల ప్రాంతాలను ఎంచుకోవటం ఉగ్రవాదుల అలవాటు. తమ మతిమాలిన చర్య వల్ల ఏ వర్గాలవారు బలవుతారు, ఎన్ని కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతామన్న విచక్షణ ఉగ్రవాదుల కుండదు.
వీరి ఉన్మాదానికి తోపుడు బళ్లు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని సొంతగూటికి చేరటం కోసం వెళ్తున్న సామాన్య పౌరులు, దగ్గర్లోని దుకాణదారులు బలయిపోయారు. పేలుడు తర్వాత ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలూ, తెగిపడిన కాళ్లూ చేతులూ కనబడ్డాయి. కొన్ని సెకన్ల క్రితం జీవంతో తొణికిసలాడిన మనుషులు ఛిద్రమైన శరీరాలతో ఆర్తనాదాలు చేస్తూ శోకించటం... కొందరు భయంతో పరుగులు పెట్టడం, అయినవారి జాడ కోసం మరికొందరు వెదుకులాడటం తలుచుకుంటేనే గగుర్పాటు కలిగించే భీతావహ దృశ్యం.
ఏదైనా ఘటన జరిగినప్పుడు అది తమ పనేనని చెప్పుకోవటం అలవాటున్న ఉగ్రవాదులు 24 గంటలు గడిచినా కిమ్మనకపోవటం అయోమయాన్ని సృష్టించటానికే కావొచ్చనిపిస్తోంది. సాధారణంగా పేలుడు జరిగిన మూడు నాలుగు గంటల్లో ఘటన స్థలిలో లభ్యమయ్యేవాటి ఆధారంగా కారకుల విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకొస్తారు.
కానీ ప్రస్తుత ఘటనలో కొంత సమయం తీసుకోకతప్పదని ఎన్‌ఐఏ భావించి ఉండొచ్చు. వాస్తవానికి మొదట్లో వాహనంలోని సీఎన్‌జీ ట్యాంక్ పేలివుండొచ్చనుకున్నా, ఆ వాహనం యజమాని పుల్వామా వాసిగా అర్ధరాత్రికి ధ్రువపడటం, క్రయవిక్రయాల సమయంలో తప్పుడు పత్రాలు దాఖలు చేశాడని తేలడం ఉగ్రవాద ప్రమేయాన్ని సూచిస్తోంది.
కేంద్రం తీసుకున్న అనేక చర్యల పర్యవసానంగా ఉగ్రదాడులు దేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2012లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడు ఘటన తర్వాత మరేదీ చోటుచేసుకోలేదు. 2008 నాటి ముంబై పేలుళ్ల ఘటన తర్వాత ఎన్‌ఐఏను ఏర్పర్చటం, నిఘా వ్యవస్థను పటిష్ఠపరచటం, అందుకోసం ప్రత్యేకంగా జాతీయ నిఘా గ్రిడ్(నేట్‌గ్రిడ్) రూపకల్పన, అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టాన్నీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్నీ మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావటం ఉగ్రవాదం నియంత్రణకు గణనీయంగా తోడ్పడ్డాయి.
అయితే ఎక్కడో ఒకచోట ఏర్పడే చిన్నపాటి ఉదాసీనత అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదుల్ని ప్రశ్నించాక పాకిస్తాన్ ప్రమేయం కనబడటాన్ని బట్టి ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా అది తన వెనకటి గుణాన్ని విడనాడలేదని అర్థమవుతోంది. అన్ని స్థాయుల్లోనూ మరింత అప్రమత్తత అవసరమని ఢిల్లీ పేలుడు ఘటనైనా, ఉగ్రవాదుల అరెస్టులైనా వెల్లడిస్తున్నాయి.


