తొమ్మిది నెలల క్రితం అధికారంలోకొచ్చింది మొదలు ఇంటా బయటా విపరీత పోకడలతో, వింత నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ఓటర్లు షాకిచ్చారు. ఆయన సోషలిస్టు, కమ్యూనిస్టు అంటూ ఈసడించుకున్న 34 ఏళ్ల యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మరోపక్క నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీకి మొహం చాటేసిన వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాలు గవర్నర్ ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గాయి.
ఆ రెండు చోట్లా డెమాక్రాట్ల తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థులు మికీ షెరిల్, అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఘనవిజయం సాధించారు. క్యాలిఫోర్నియాలో ప్రతినిధుల సభకూ, సెనేట్ సీట్లకూ జిల్లాల హద్దులు నిర్ణయించే పోలింగ్‌లో సైతం డెమాక్రాట్లదే పైచేయి. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రతినిధుల సభకూ, సెనేట్‌లోని కొన్ని స్థానాలకూ జరగబోయే ఎన్నికలపై రిపబ్లికన్లు ఆశ వదులుకోవాల్సి రావొచ్చు.
ట్రంప్ దూకుడుతో చేష్టలుడిగిన డెమాక్రటిక్ పార్టీకి ఓటర్లే ఊపిరి పోశారని ఫలితాల సరళి చెబుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 20 లక్షల మందిపైగా ఓటు హక్కు వినియోగించుకోవటమైనా, వారిలో సగంమందికి పైగా మమ్దానీ పక్షాన నిలవటం అయినా అసాధారణం. న్యూయార్క్ వందేళ్ల చరిత్రలో ఆయనది ప్రత్యేకమైన రికార్డు. ముస్లిం కావటం, భారతీయ మూలాలున్న వ్యక్తి అయివుండటం, చిన్న వయసులో కీలక పదవికి చేరుకోవటం రికార్డు. విజేతలు ముగ్గురూ కావడానికి డెమాక్రాట్లే అయినా భిన్న దృక్పథాలున్నవారు.
గవర్నర్లుగా ఎన్నికైన షెరిల్, స్పాన్‌బెర్గర్ మధ్యేవాదులు కాగా, మమ్దానీ వామపక్ష భావాలున్నవారు. నమ్ముకున్న మధ్యేవాదాన్ని విడనాడితే తప్ప ఉనికి ఉండబోదన్న ఆందోళనలో డెమాక్రాట్లున్న తరుణంలో మొన్న ఫిబ్రవరిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో జరిగిన పోటీలో మమ్దానీ నిలిచారు. అప్పటికి ఆయనకు నిండా ఒక శాతం ఓట్లు కూడా లేవు. పైగా పోటీపడింది పార్టీలో సంవత్సరాలుగా పాతుకుపోయి, గవర్నర్‌గా ఎంతో అనుభవం గడించిన ఆండ్రూ కూమోతో. కూమోకు ఐశ్వర్యవంతుల దన్నుంది.
పైగా రిపబ్లికన్లకూ, డెమాక్రాట్లకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నా యూదుల ఓటు బ్యాంక్‌ను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌నే సమర్థిస్తారు. అలాంటి పార్టీలో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను వ్యతిరేకించటం, మానవ హక్కుల హననాన్ని నిరసించటం సామాన్యం కాదు. ఆ పని మమ్దానీ చేయగలిగారు. దీంతోపాటు వలసదారులపై ట్రంప్ కత్తిగట్టడాన్ని బాహాటంగా ఖండించారు.
ఇదంతా పార్టీకి చేటు తెస్తుందని స్వపక్షంలోనే అనేకులు లబలబలాడారు. కానీ మమ్దానీ దృఢంగా నిలబడ్డారు. కనీస అవసరాలైన తిండిగింజలు, గూడు, ఆరోగ్యం అందుబాటు ధరల్లో ఉండాలన్న నినాదంతో ముందు కెళ్లారు. పార్టీలో తన రేటింగ్‌ను డబుల్ డిజిట్‌కు తీసుకెళ్లారు. సర్వేల్లో సైతం ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. న్యూయార్క్‌కు ఫెడరల్ నిధులు ఆపేస్తాననీ, నగరం సర్వనాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ జనం బేఖాతరు చేశారు.
వలసలపై యుద్ధం చేస్తున్న ‘మాగా’ ఉద్యమకారులు, రిపబ్లికన్లకు వారిదైన ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ఉంది. దాని సాయంతో విశ్వవిద్యాలయాల్లోనూ, రోడ్లపైనా చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వారిది చిత్రమైన అవస్థ. ట్రంప్ నేరుగా స్పందించాలా లేదా అన్నది వారు తేల్చుకోలేకపోయారు. సంప్రదాయ ఓట్లు రాలాలంటే ట్రంప్ స్పందించి తీరాలి. తీరా ఓటమి పాలైతే ట్రంప్‌పై రిఫరెండమ్ అవుతుంది. చివరకు ఆయన మమ్దానీపై నిప్పులు చెరిగారు.
సొంత పార్టీ అభ్యర్థి సిల్వాను కాదని కూమో వైపు మొగ్గారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. అందుకే ఈ ఓటమి పాపం ట్రంప్‌కి చుట్టుకుంది. అధికారం శాశ్వతమని విర్రవీగే దేశ దేశాల పాలకులకూ ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. మందబలంతో చెలరేగితే చివరకు అధోగతేనని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు రిపబ్లికన్లకు నీరాజనం పట్టి ఏడాది కాలేదు. ట్రంప్ తన నియంత పోకడలతో దాన్నంతటినీ కాలదన్నుకున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత!


