ఇతర విషయాల మాటెలా ఉన్నా మహిళలకు సంబంధించి బాధ్యతాయుతంగా మాట్లాడటం, నాగరికంగా వ్యవహరించటం మన నేతలకు ఇప్పట్లో చేతకాదని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గియా నిరూపించారు. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం ఆస్ట్రేలియా క్రీడాకారిణులిద్దరి పట్ల ఒక దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతంలో ఆయన స్పందన అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అది అర్ధరాత్రో అపరాత్రో జరిగింది కాదు. పట్టపగలు 11 గంటలకు నడిరోడ్డుపై చోటుచేసుకుంది. తాము బస చేసిన హోటల్ నుంచి కేవలం కొన్ని మీటర్ల దూరంలోని కెఫేకు వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు వారిపై ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు.
సమీపంలోని వ్యక్తి ఆ వాహనం నంబర్ గుర్తుపెట్టుకుని పోలీసులకు చెప్పటంతో వెనువెంటనే దుండగుణ్ణి అరెస్టు చేశారు. అకిల్ ఖాన్ అనే ఆ యువకుడిపై పాత కేసులు కూడా ఉన్నాయని తేలింది. పోలీసులు తక్షణం స్పందించి చర్య తీసుకున్న తీరు ఉన్నంతలో ప్రశంసించదగ్గదే. కానీ దాన్నంతటినీ మంత్రి వ్యాఖ్యలు నీరుగార్చాయి. మన దేశంలో క్రికెటర్లపై చచ్చేంత మోజు ఉంటుందట. అందువల్ల వారు బయట తిరిగేటపుడు సెక్యూరిటీని తోడు తీసుకుని వెళ్లాలట. ఈ ఘటన ఆ క్రీడాకారిణులకు ఒక గుణపాఠమట. క్రికెటర్లంటే ఉన్న మోజు వల్లే ఈ ఉదంతం జరిగిందని ఆయన ఎలా అనగలిగారో అనూహ్యం.
మన పర్యాటక రంగం గతంతో పోలిస్తే ఎంతో విస్తరించింది. మన సాంస్కృతిక వారసత్వ వైభవం, వైవిధ్యభరితమైన ప్రకృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ రంగం ద్వారా మన జీడీపీకి రూ. 20 లక్షల కోట్లు సమకూరుతున్నదనీ, ఏటా పర్యాటకం 25 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నదనీ ఇటీవలే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖవత్ ఆ రాష్ట్రంలో జరిగిన సదస్సులోనే ప్రకటించారు. పైగా ఈ రంగంలో 8.4 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. నిజానికి పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని నిపుణులు ఏనాటి నుంచో చెబుతున్నారు.
నిరుడు మన దేశాన్ని కోటిమంది విదేశీ పర్యాటకులు సందర్శించగా, థాయ్‌లాండ్‌కు మూడు న్నర కోట్లమంది వెళ్లారు. మన దేశాన్ని సందర్శించేవారికి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు జాగ్రత్తల పేరిట ఇచ్చే సలహాలు చదివితే ఆగ్రహం కలిగిస్తాయి. మనల్ని చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మహిళలకు భద్రత, రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవటం ద్వారా అవి దురభిప్రాయాలేనని చూపవచ్చు. అది చేయకపోగా ఇష్టానుసారం మాట్లాడటం తగునా?
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో శాంతిభద్రతల విభాగం ఉంటుంది. రాష్ట్ర హోంమంత్రి ఇండోర్‌కు ఇన్‌ఛార్జి. స్థానికంగా ఉన్న హోల్కర్ స్టేడియంలో జరిగే అయిదు మ్యాచ్‌ల కోసం వేర్వేరు దేశాల టీమ్‌లు ఆ హోటల్‌లో బస చేశాయి. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిపై అధికారుల స్థాయిలో చర్చించుకునే ఉంటారు. తీసుకున్న భద్రతా చర్యలేమిటో తెలి యదుగానీ ఈ సిగ్గుచేటైన ఘటన చోటుచేసుకుంది.
ఇందుకు క్షమాపణ చెప్పి, ఇవి పునరావృతం కానీయబోమని మంత్రి చెప్పివుంటే హుందాగా ఉండేది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై దుండగుడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆందోళన చేస్తున్నవారితో ‘అసలు సాయంత్రం ఆరు తర్వాత ఆడపిల్లలు బయటికెందు కొస్తారు?’ అంటూ అప్పటి వీసీ త్రిపాఠీ చిందులు తొక్కారు. ఇలాంటి అనాగరిక, అనా రోగ్య అభిప్రాయాలు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోవటం వల్లే మహిళల పట్ల సమాజంలో చిన్నచూపు కొనసాగుతోంది.
లైంగిక నేరాల విషయంలో మన ప్రభుత్వాలు ఉండాల్సినంత కఠినంగా ఉంటున్నాయా? మహిళలపై జరిగే ఇతర నేరాల సంగతలా ఉంచి అత్యాచారాల విషయంలో పడే శిక్షలే మూడు శాతం కన్నా తక్కువున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి సాగే విచారణలు మరింతమంది నేరగాళ్లు పుట్టుకురావటానికి దోహదపడుతున్నాయి. ఇది మన వ్యవస్థల ఉదాసీనతను తేటతెల్లం చేస్తోంది. కనీసం ఈ కేసులోనైనా సత్వర విచారణ జరిగి, శిక్ష పడేలా చేయగలిగితే విదేశీ పర్యాటకులకు భరోసా ఇచ్చినట్టవుతుంది.


