‘మన పోలీసులకు తగినంత సామర్థ్యం లేదు. సంస్థాగతంగా, శిక్షణపరంగా ఎన్నో లోపాలున్నాయి. పోలీసు వ్యవస్థపై తగిన పర్యవేక్షణ కూడా లేదు’– ఇవి ఇటీవల ఏదో ఉదంతంలో ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. సరిగ్గా నూట ఇరవై మూడేళ్ల క్రితం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఫ్రేజర్ నేతృత్వంలోని రెండో పోలీస్ కమిషన్ నివేదికలోని మాటలు. దేశంలో తరచుగా జరిగే ఉదంతాలు వింటుంటే అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదని అర్థమవుతుంది.
మిగిలినవాటి మాటెలా ఉన్నా పౌరుల్ని అరెస్టు చేయటం విషయంలో నిబంధనలు సక్రమంగా పాటించే సంస్కృతి పోలీసులకు అలవడ లేదు. అందుకే ఎవరినైనా అరెస్టు చేయదల్చుకున్నప్పుడు నిందితులకు అర్థమయ్యే భాషలో అందుకు గల కారణాలను వెంటనే తెలియజెప్పాలని, వారిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో... ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో లిఖిత పూర్వకంగా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్‌ల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది.
ఒకవేళ అందుకు వ్యవధి లేకపోతే కోర్టులో హాజరు పరచటానికి రెండు గంటల ముందైనా నెరవేర్చాలని నిర్దేశించింది. అలా చేయకపోతే ఆ అరెస్టూ, రిమాండ్ కూడా చట్టవిరుద్ధమే అవుతాయని స్పష్టం చేసింది.మన దేశంలో దాదాపు 40 శాతం అరెస్టులు స్వల్ప కారణాలపైనే జరుగుతాయి. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారు కనుక తమను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియదు. పోలీసులు చెప్పరు.
‘కామన్ కాజ్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా’ నివేదిక అరెస్టుల విషయంలో కులం, మతం, రాజకీయ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది. 17 రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల వరకూ వేలాది మందితో మాట్లాడి ఈ నివేదిక రూపొందించారు. అరెస్టుల విషయంలో నిబంధనలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తామని కేవలం 41 శాతం మంది చెప్పారు. ఒక మతం లేదా కులానికి చెందినవారు సహజంగా నేరగాళ్లన్న భావన నిలువెల్లా పాతుకుపోయింది.
ఇలాంటివారి విషయంలో ఇక నిబంధనలేం పాటిస్తారు? ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఒక ఊరట. నిజానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పటం మొదటి సారేమీ కాదు. గత ఫిబ్రవరిలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం సైతం విహాన్ కుమార్ కేసులో పోలీసులకు రాజ్యాంగం నిబంధనలను గుర్తు చేయాల్సి వచ్చింది. నిరుడు పంకజ్ బన్సాల్, ప్రబీర్ పురకాయస్థల కేసుల్లోనూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ సంగతే చెప్పాయి.
అరెస్టులకు సంబంధించి రాజ్యాంగం 22వ అధికరణంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏకపక్ష అరెస్టు లేదా నిర్బంధం నుంచి పౌరులకు రక్షణనిస్తున్నాయి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచటానికి ముందే అరెస్టుకు దారితీసిన కారణాలేమిటో నిందితులకు తెలియాలనీ, న్యాయవాదిని నియమించుకుని సమర్థించుకునే అవకాశం ఉండాలనీ, బెయిల్ కోరవచ్చనీ ఆ అధికరణం చెబుతోంది. గతంలో సీఆర్‌పీసీ (ఇప్పుడు బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 57, అరెస్టయినవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్దేశిస్తోంది.
కానీ 22వ అధికరణానికి అనుగుణమైన చట్టాలు కొరవడటం పోలీసుల ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. మన దేశంలో అరెస్టు చేయటానికి ‘సహేతుకమైన అనుమానం’ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ‘సంభావ్యమైన కారణం’ చూపాలి. ఈ వ్యత్యాసం వల్లే అక్రమ అరెస్టులు రివాజవుతున్నాయి. ఫలితంగా ‘చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప పౌరుల జీవితాన్నీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించ రాద’ని చెప్పే రాజ్యాంగంలోని 21వ అధికరణం కూడా ఉల్లంఘనకు గురవుతోంది.
అక్రమ అరెస్టు ఆ వ్యక్తిపైన మాత్రమేకాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైనా ప్రభావం చూపుతుందనీ, వారి మానసిక సమతౌల్యాన్నీ, సామాజిక సంక్షేమాన్నీ దెబ్బతీస్తుందనీ సుప్రీంకోర్టు చేసిన తాజా హెచ్చరిక పాలకులకు కనువిప్పు కావాలి. నేరాలు పెరిగాయనో, చట్టాలంటే భయం లేకుండా పోయిందనో పోలీసులు చట్ట బాహ్యతను ఆశ్రయించటం నీతిమాలినతనం. పాలకులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు.


