సాక్షి, చైన్నె: పెరంబలూరు జిల్లాలో పచ్చమలై కొండ ప్రాంతాల్లో హఠాత్తుగా మొదలైన భారీ వర్షాల కారణంగా అడైక్కంపట్టి వాగులో వరద పోటెత్తింది. ఈ ఉధృతిలో నీటిలో కొట్టుకుపోయిన వారిని స్థానికులు సాహసోపేతంగా కాపాడారు. పెరంబలూరు జిల్లా అలత్తూరు తాలూకా అడైక్కంపట్టి గ్రామం సమీపంలోని పచ్చమలై పర్వత ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అడపాద దడపా స్వల్పంగా కురుస్తున్న వర్షాలకు మంగళం జలపాతం, విశ్వగుడి రిజర్వాయర్‌తో పాటు అడైక్కంపట్టి చిన్న, పెద్ద ఏరులకు నీరు వచ్చి చేరుతోంది.
పెరిగినవరద ఉధృతి
రాత్రంతా కురిసిన కురిసిన భారీ వర్షానికి ఏరుల్లో నీరు ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో అడైక్కంపట్టి ఏరుల పక్కనే ఉన్న తమ పొలాల నుంచి అవలి వైపునకు వెళ్లడానికి ప్రయత్నించిన స్థానికులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కొందరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. ఇందులో ఒకరు తన ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోతుండటంతో తీవ్ర కలకలం రేగింది.
గ్రామస్తుల సాహసం
పరిస్థితిని గమనించిన స్థానిక గ్రామస్తులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. తాడు సాయంతో సాహసోపేతంగా వ్యవహరించి వరదలో కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అంతేకాకుండా నీటిలో మునిగిపోయిన ద్విచక్ర వాహనాన్ని కూడా వెలికితీశారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ వరద పెను ప్రమాదానికి దారితీయడంతో, ఏరులు, జలపాతాల పరిసరాలకు ఎవరూ వెళ్లకూడదని జిల్లా యంత్రాంగం కఠిన నిషేధాజ్ఞలు జారీ చేసింది. పచ్చమలై ప్రాంతాల్లో వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


