సాక్షి, చైన్నె: తట్టంచవాడి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల తర్వాత పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధించడం కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కూటమి నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నానని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగసామి ప్రకటించారు. అక్టోబర్ 6న జరగనున్న తట్టంచవాడి ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో, పుదుచ్చేరి కామరాజర్ శాలైలోని హోటల్‌లో సీఎం రంగస్వామి అధ్యక్షతన ఎన్డీయే కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం, అన్నాడీఎంకే రాష్ట్ర కార్యదర్శి అన్బళగన్, పీఎంకే నాయకులు, మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తట్టంచవాడి నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థిగా ఎన్.ఆర్. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే అశోక్ ఆనంద్ పేరును సీఎం అధికారికంగా ప్రకటించి పరిచయం చేశారు.కూటమి నాయకులు, కార్యకర్తలు ఏకమై అశోక్ ఆనంద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక, ఈ ఉ ప ఎన్నికలలో కాంగ్రెస్‌కు టీవీకే మద్దతు ప్రకటించింది.ఎన్‌ఆర్ కాంగ్రెస్–బీజేపీ కూటమి అభ్యర్థి అశోక్ ఆనంద్, డీఎంకే తరఫున సేతు సెల్వం, సీపీఐ నుండి సలీం, నామ్ తమిళర్ కట్చి నుండి కార్తీక్ కుమారి ప్రధాన అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పొత్తు పెట్టుకుని పోటీ చేసిన నేయం మక్కల్ కళగం అభ్యర్థి వినాయగం, కాంగ్రెస్ నాయకత్వంతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఆయనకు టీవీకే మద్దతుప్రకటించింది. టీవీకే ప్రధానకార్యదర్శి ఆనంద్,పుదుచ్చేరి కాంగ్రెస్ నేతల వైద్యలింగం తదితరులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ధారాపురంలో సుకన్య నామినేషన్
తిరుప్పూర్ జిల్లా దారాపురం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి సుకన్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఫెలిక్స్ రాజాకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈరోడ్ ఎంపీ ప్రకాష్, మాజీ మంత్రులు స్వామినాథన్, కయల్విజి సెల్వరాజ్‌తో పాటు పలువురు డీఎంకే ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక మధురాంతకంలోనూ నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. కాగా, బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.


