అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి యూఎస్ ప్రీమియర్స్ ముందుగానే ప్రారంభం కానున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్, గెటప్ శ్రీనుతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ తాగుతూ, మస్క్ బన్ తింటూ ఇద్దరూ సరదాగా ముచ్చటిస్తూ ఈ ఇంటర్వ్యూలో ఓ అపరిచితుడికి ప్రాంక్ కాల్ చేశారు.
ఆ ప్రాంక్ కాల్‌లో.. అఖిల్ నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నానని చెప్పగా, దానికి అవతలి వ్యక్తి వెంటనే నేను నాగార్జునను మాట్లాడుతున్నానంటూ కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ నిజంగానే తనతో మాట్లాడుతున్నాడని చెప్పినా కూడా ఆ వ్యక్తి నమ్మకుండా నాగ చైతన్య ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ మరింత సెటైర్ చేశాడు. అంతేకాక, ఆ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ “నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్” అని మరో పంచ్ వేశాడు.
అనంతరం అఖిల్ పక్కనే ఉన్న గెటప్ శ్రీను ఫోన్ అందుకుని నేను గెటప్ శ్రీను అన్నా అని చెప్పగా, ఆ వ్యక్తి వెంటనే నేను సుధీర్.. ఏంటో చెప్పండి అంటూ మరోసారి సెటైర్ చేశాడు. ఎంత చెప్పినా అతడు నమ్మకపోవడంతో అఖిల్, శ్రీను నవ్వుకుంటూ కాల్ కట్ చేశారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి తిరిగి కాల్ చేసి ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేశారు? అని అడగడం వీడియోలో కనిపించింది. ఈ సరదా ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.


