'సలార్'లో వరదరాజు మన్నార్‌గా, మహేష్-రాజమౌళి 'వారణాసి'లో కుంభ అనే విలన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన లేటెస్ట్ మలయాళ సినిమా 'ఐ నోబడీ'. ఈరోజు (జూలై 10) తెలుగులోనూ థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? ఎంత థ్రిల్లింగ్‌గా అనిపించింది అనేది రివ్యూలో చూద్దాం?
కథేంటి?
రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్‌లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అయితే అదే టైంకి బ్యాంక్‌లో ఉన్న రాజీవన్‌ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు. దారిలో ఇతడ్ని వదిలేయాలని అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్‌లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాత్రం మాయం అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరు తీశారు? ఇందులో రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులు డబ్బు కనుగొన్నారా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
జస్ట్ ఊహించుకోండి.. మీరు ఓ సాధారణ మనిషి. ఓ బ్యాంకు దోపిడి కేసులో అనుకోకుండా బందీగా చిక్కుకున్నారు. దోపిడి చేసిన దొంగలు సడన్‌గా చనిపోయారు. డబ్బు కనిపించకుండా పోయింది. అప్పుడు పోలీసులు మిమ్మలి సాక్షిగా చూస్తారా? అనుమానంతో చూస్తారా? కచ్చితంగా అనుమానిస్తారు. మీరే ఆ దొంగతనం చేసి, డౌట్ రాకుండా మిగతా వాళ్ళని చంపేశారని అనుకుంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీ దగ్గరే డబ్బు ఉందని ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. అవసరమైతే మిమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడరు. ఈ సినిమాలో రాజీవన్ పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్.
బ్యాంక్ దోపిడీ కేసులో అన్ని ఆధారాలు రాజీవన్.. దొంగ అన్నట్టు చూపిస్తాయి. దీంతో పోలీసులు అతడిని నేరస్తుడిగా అనుమానిస్తారు. తాను నిర్దోషినేనని చెప్పకుండా మౌనం పాటిస్తున్న రాజీవన్.. అసలు ఈ కేసులో ఎలా చిక్కుకున్నాడు? అతని పాత్ర ఏమిటి? చివరకు తప్పించుకున్నాడా లేదా అనేది అసలు కథ.
రాజీవన్.. 100 నుంచి నంబర్స్ వెనక్కు లెక్కపెడుతూ గన్‌తో బ్యాంక్‌లోకి అడుగుపెట్టే సీన్‌తో మూవీ మొదలు అవుతుంది.(ఈ నంబర్స్ లెక్కపెట్టడం అనే సీన్ కథలో అసలు ట్విస్ట్‌కి కారణం అవుతుంది)వెంటనే రూ.17 కోట్లు దోపిడి, హీరోని బందీగా తీసుకుని వెళ్ళిపోవడం చకచకా జరిగిపోతాయి. ఇక అక్కడి నుంచి నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఫస్ట్ హాఫ్ ట్రైన్‌లా స్పీడ్‌గా దూసుకెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది అనే టెన్షన్ క్షణక్షణానికి పెరుగుతూ పోతుంది. ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
ఫస్ట్ హాఫ్ మంచి హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఇలా ఉంటే ఇంకేం బొమ్మ ఇక సూపర్ హిట్ అని అనుకుంటాం. కానీ అనవసరమైన సాగతీతతో కొన్నిచోట్ల బోర్ కొట్టించేశారు. స్పీడ్ బ్రేకర్‌లా కొన్ని సీన్స్ వస్తాయి. స్టోరీ కూడా క్లైమాక్స్‌కి రాకుండా అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. చివర్లో అసలు ఊహించని క్లైమాక్స్ వస్తుంది గాని ఏదో ఇరికించి చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాలో రాజీవన్ మనస్తత్వాన్ని, పరిస్థితులను ఎదుర్కొనే అతని తెలివితేటలను బలంగా చూపించారు. రాజీవన్‌ని ఓ హీరోలా కాకుండా ఓ సాధారణ మనిషిలా చూపించడం సినిమాకు ప్రధాన బలం. ఫైట్స్ ఇరగదీయడం అనే సినిమాటిక్ లిబర్టీ తప్పితే మిగతా అన్ని చోట్ల సహజంగా అనిపిస్తాడు. మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో లిఫ్ట్ ఫైట్ సీన్ అయితే టెక్నికల్ బ్రిలియన్స్ అంటే ఏంటో చూపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో బస్, ఇంట్లో జరిగే ఫైట్స్ కూడా రియాలిటీకి దగ్గరగా అనిపిస్తాయి.
ఒక అబద్దాన్ని, రూమర్‌ని కూడా ఎంత అందంగా, అద్భుతంగా మలిచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారో.. వాటిని జనాలు ఎలా గుడ్డిగా నమ్మేస్తారో అన్నది ప్రస్తుతం సమాజంలో విచ్చలవిడిగా జరుగుతోంది. దాన్ని అంతే అద్భుతంగా ఈ సినిమాలో చూపించారు. సోషల్ మీడియా, మీడియా ప్రభావం ఈ సమాజం మీద ఎంతలా ఉంది? మన సిస్టమ్ ఎలా పని చేస్తుంది? పోలీసు, రాజకీయ వ్యవస్థల పనితీరు ఎలా ఉంటుంది? అని సెటైరికల్‌గా చక్కగా చూపించారు. డబ్బు ఎవరిని ఎలా మార్చేస్తుంది? డబ్బు ఎలాంటి పనుల్ని చేయిస్తుంది అనేది కూడా బాగా చూపించారు.
ఇప్పటివరకు దోపిడి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన మూవీస్‌లో దొంగ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే బాధితుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. కానీ ఓ బందీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాని చూపించడం డిఫరెంట్‌గా అనిపించింది. దానికి తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేయాలి అనుకున్నారు గానీ వర్కౌట్ కాలేదు.
ఇకపోతే ఇంటర్వెల్ తర్వాత సినిమా నెమ్మదిగా సాగడం, మూడు నాలుగు జానర్స్ మిక్స్ చేసినట్టు అనిపించడం లాంటివి మైనస్. 2 గంటల 48 నిమిషాల నిడివి కూడా మరో మైనస్. సెకండ్ హాఫ్‌లో ఓ 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే మూవీ మరింత ఎఫెక్టివ్‌గా ఉండేదేమో?
యాక్టింగ్ విషయానికి వస్తే హీరోగా చేసిన పృథ్వీరాజ్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తక్కువ డైలాగ్స్ ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే నటించాడు. ఇతడి భార్య మీరాగా పార్వతి కూడా తన అనుభవాన్ని చూపించింది. కూతుర్లుగా చేసిన ఇద్దరు పిల్లలు ఆకట్టుకున్నారు. జాకబ్ పాత్ర చేసిన నటుడు, కానిస్టేబుల్‌గా చేసిన నటుడు, ఇంకా చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కాదు కానీ తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ ఇంప్రెసివ్‌గా చేశారు.
టెక్నికల్ విషయాలకు వస్తే దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బెజోయ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్‌కి తీసుకుని వెళ్లాయి. ముఖ్యంగా లిఫ్ట్ ఫైట్ సీక్వెన్స్, స్లో-మోషన్ ట్రాకింగ్ షాట్లు భలే క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ నిస్సాం బషీర్ తనదైన స్క్రీన్ ప్లేతో ఆశ్చర్యపరిచాడు. రైటింగ్ డిపార్ట్మెంట్ కూడా అదరగొట్టేసింది.
మొత్తంగా 'ఐ, నోబడీ' కొత్త తరహా హైస్ట్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్నప్పటికీ, సుదీర్ఘ నిడివి, చివరలో కొంత లాగ్ వల్ల కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ చిన్న మిస్టేక్స్ లైట్ తీసుకుంటే మాత్రం క్రేజీ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
-చందు డొంకాన


