– నాగార్జున అక్కినేని
‘‘నేను ఎక్కువగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది ‘మనం’ చిత్రం కోసమే. అది నాన్నగారి కోసం (అక్కినేని నాగేశ్వరరావు) చేశాను. ఇప్పుడు నా కొడుకు అఖిల్ కోసం ‘లెనిన్’కి చేస్తున్నాను. ఏ తండ్రి అయినా కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు. కొడుకు సక్సెస్ అయితే తండ్రి సంతోషిస్తాడు. ప్రేమతో, ఇష్టంతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని నాగార్జున అక్కినేని తెలిపారు.
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నందు (మురళీ కిషోర్) ఈ కథను అద్భుతంగా రాశారు. ‘లెనిన్’ కథలో ఉండే పెయిన్‌ని తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు అఖిల్.
నేను ఈ సినిమాలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాక కథ విషయంలోనూ ఎక్కువగా కల్పించుకున్నాను. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం ఈ చిత్రాన్ని చేయలేదు. అందుకే మాకు సంతృప్తి అనిపించేంత వరకూ విడుదల కోసం ఆగాం. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నా... జూలై 10న వస్తున్నాం... కొడుతున్నాం... మనోడు కొడుతున్నాడు’’ అని పేర్కొన్నారు.
అఖిల్ మాట్లాడుతూ– ‘‘మన మూలాలకు, తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ‘లెనిన్’ కథ ఉంటుంది. ఈ మూవీ కోసం మేం నిజాయితీగా కష్టపడ్డాం’’ అని చె΄్పారు. ‘‘లెనిన్’లాంటి మంచి సినిమా చేశామని గర్వంగా చెప్పగలను’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ– ‘‘అఖిల్‌గారు తొలిసారి విలేజ్ కుర్రాడి పాత్రను పోషించిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘లెనిన్’లో నేను చేసిన భారతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడారు.


