మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు

Spiritual Story On Bhishma - Sakshi

"సత్యం, పవిత్రత, నిస్వార్థం-ఈ సుగుణాలున్న వాడిని అణగద్రొక్కగల సామర్ధ్యం ముల్లో కాలలో ఎవరికీ లేదు. ఇలాంటి సుగుణ సంపన్నుడు విశ్వమంతా ఏకమైనా ఒంటరిగా ఎదిరించగలుగుతాడు" అని అంటారు స్వామి వివేకానంద. సువర్ణమయం పృథివీం చిన్నంతి పురుషాస్త్రయః । శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుమ్ ॥ ఈ భూతలాన్ని సువర్ణమయం చేయగలగే వారు- శూరులు, జ్ఞానులు, సేవాతత్పరులు. ఈ మూడు తరహాల వారినే 'మహాత్ములు' అంటారు.

ధర్మనిరతిలో సాటిలేని రాముడు 'ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు' గా వాసి కెక్కాడు. సత్యనిష్ఠలో మేటి అయిన హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు' గా వినుతికెక్కాడు. దానగుణంలో తిరుగులేని కర్ణుడు 'దానకర్ణుడు' ఖ్యాతిగాంచాడు. ఇలా శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, కర్ణుడు తమ తమ దివ్యగుణాలతోనే అజరామరమైన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించారు. అలాగే గంగాదేవి శంతన మహారాజు పుత్రుడు దేవవ్రతుడు తన భీషణ ప్రతిజ్ఞతో 'భీష్ముని' గా ప్రసిద్ధి  చెందాడు

రాజవంశంలో భోగమయ జీవితాన్ని అనుభవించాల్సిన భీష్ముడు అఖండ బ్రహ్మ చర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడిపి బ్రహ్మనిష్ఠుడయ్యాడు. త్యాగనిరతి, ఇంద్రియ నిగ్రహ శక్తి, ధర్మనిబద్దతల సంగమ క్షేత్రమే ఆయన పవిత్ర జీవనం. ఇలాంటి పావనమూర్తి చరించిన ఈ భారతభూమి బంగారుభూమే! మహాత్ములకు మహాత్ముడు భీష్ముడు. శౌర్యం, సేవాతత్పరత, సత్యనిష్ఠ, పవిత్రత,ఈగుణాలు పుష్టిగావున్నాయి భీష్మునిలో.

తండ్రిన సంతోషపరచడమే తనయుని ధర్మమని తలచిన దేవవ్రతుడు తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించడానికి, ఆమె తండ్రి దాశరాజును ఒప్పించడానికి వెళ్ళాడు.
అప్పుడు దాశరాజు 'నా కుమార్తెకు పుట్టిన బిడ్డకే పట్టాభిషేకం చేయాలి' అని షరతు పెట్టాడు. అప్పుడు దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు."ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువు లందరూ వినండి! నేను తండ్రిగారి ప్రయోజనం కోసం స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. 

అదేమంటే ఈమెకు పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి అవడానికి అర్హుడు" అని పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కాని దాశరాజు ఈ ప్రతిజ్ఞతో సంతోషపడలేదు. ఇలాగన్నాడు.
"అది సరే!కాని నీకు పుట్టిన కుమారుడు రాజ్యాన్ని ఆశించకుండా ఉంటాడని ఏమిటి నమ్మకం?"అప్పుడు చిత్తస్తైర్యంగా బ్రహ్మచర్య వ్రతాన్ని చేబడుతున్నాను అని మరో శబధం
చేసాడు శంతనుని కుమారుడు.

భీష్ముడు అస్త్రశస్త్ర విద్యలో అసమాన ప్రతిభావంతుడు. తన తమ్ముల కొరకు కన్యలు తేవాలని కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్ళి అక్కడ ఎందరో రాజులను పరాజితులను చేశాడు. గురువైన పరశురాముడంతటి మహాశూరుడ్ని యుద్ధంలో ఓడించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టించాడు. భీష్మునలో రాజ్యకాంక్ష , భోగలాలస ఏమాత్రం లేదు. స్వార్థరహితుడు.కుమారుని సత్యనిష్ఠకు సంతసించి శంతనుడు కుమారునకు ఇచ్ఛామరణ వరాన్ని ప్రసాదినచాడు.  కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాల్లో సుప్రతిష్టుడైన కురు వృద్ధుడిని శ్రీకృష్ణుడు "జన్మములిట్టివి యెందుకల్గునే" అని ప్రశంసించాడు.
-గుమ్మా ప్రసాద రావు భిలాయి 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top