కోరికల తరంగాలు.. | Ganapathi Sachchidananda Swamy Explains Desires Guest Column Special Story | Sakshi
Sakshi News home page

కోరికల తరంగాలు..

Jul 2 2026 7:15 AM | Updated on Jul 2 2026 9:24 AM

Ganapathi Sachchidananda Swamy Explains Desires Guest Column Special Story

దత్తబోధ

నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.

ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?

ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.

ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్‌! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.

‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement