దేశంలో తొలిసారి: 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు! | India Achieves Record 99% Birth And Death Registration In 2024 As Per CRS Report | Sakshi
Sakshi News home page

దేశంలో తొలిసారి: 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు!

Jul 2 2026 9:58 AM | Updated on Jul 2 2026 10:10 AM

Birth and Death Registration India

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 2024లో జనన, మరణాల నమోదు అంచనాలలో 99 శాతం మార్కును దాటి సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్‌జీఐ) విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం.. దేశంలో అంచనా వేసిన మొత్తం జననాలలో 99.1శాతం (2,54,73,389 జననాలు), మరణాలలో 99.4శాతం (89,38,301 మరణాలు) అధికారికంగా నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో జననాలు 1.1శాతం, మరణాల నమోదు 3.2శాతం పెరిగాయి. గత దశాబ్ద కాలంలో (2014లో జననాలు 86.6 శాతం, మరణాలు 72.5 శాతం మాత్రమే నమోదయ్యేవి) ఈ నమోదు ప్రక్రియ నిరంతరం మెరుగుపడుతూ రావడం విశేషం.

జాతీయ సగటు 100 శాతానికి చేరువవుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జననాల నమోదు ఇంకా 80%-90% మధ్యే ఉంది. అలాగే బీహార్ (62.1%), జార్ఖండ్ (50.7%) రాష్ట్రాలు మరణాల నమోదులో వెనుకబడి ఉన్నాయి. అయితే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రేటు సాంకేతికంగా ఎక్కువగా కనిపించడానికి గల కారణాలను నివేదిక ప్రస్తావిస్తూ.. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్‌) అంచనాలు నివాస స్థలాన్ని బట్టి, ఎస్‌ఆర్‌ఎస్‌ నమోదు ఘటన జరిగిన స్థలాన్ని బట్టి లెక్కించడమేనని స్పష్టం చేసింది.

ఈ నివేదికలో ఆరోగ్య రంగానికి సంబంధించి మరికొన్ని సానుకూల అంశాలు వెల్లడయ్యాయి. వైద్య సహాయం లేకుండా సంభవించే మరణాల శాతం 2023లో 53.4% ఉండగా, 2024 నాటికి అది 52.5%కి తగ్గింది. అదే సమయంలో, ఆసుపత్రులు లేదా వైద్య సంస్థల్లో జరిగే ప్రసవాలు 2023లోని 74.7% నుండి 2024లో 79.4%కి పెరిగాయి. ఇది 2019 (81.2%) తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కాగా, ఇటీవల విడుదలైన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ డేటా ఈ సంస్థాగత ప్రసవాలను 90.6% గా చూపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement