ఒక మనిషికి ఇన్ని పేర్లా?..

Spiritual Essay About Arjuna In Bhagavad Gita - Sakshi

అంతఃపురంలో ఆడవాళ్ళే మిగిలారు. విరటుడు సైన్యంతో సుశర్మను ఎదుర్కొనాడానికి వెళ్ళాడు. మారువేషాలలో ఉన్న పాండవులు నలుగురూ వెళ్ళారు. ఇంతలో దూత వచ్చి ఉత్తరదిశను పెద్ద సైన్యం మన గోవులను మళ్లించుకు వెళ్ళిం దని ఉత్తరకుమారుడికి చెప్పాడు. నా వద్ద సారథిలేడు, ఉంటే నేను వారిని ఓడించి గోవులను తీసుకు వస్తానని ఉత్తరకుమారుడు బిరాలు పలికేడు. అప్పుడు సైరంద్రి బృహన్న లను తీసుకు వెళ్ళమంటుంది. మరో గత్యం తరం లేక ఉత్తరకుమారుడు వెళ్తాడు. అక్కడ సైన్యాన్నిచూసి భయపడి బృహన్నల వారి స్తున్నా పారిపోతాడు. బృహన్నల ఉత్తరడుని అడ్డగించి నేను అర్జునుడిని. నీవు రథం నడుపు నేను యుద్ధం చేస్తానంటాడు. ఉత్తరుడు నమ్మడు. ఆ మాటలు విన్న ఉత్తర కుమారుడు సంభ్రమాశ్చర్యాలతోసందేహంగా "బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి. వాటిని వివరిస్తే నేను నిన్ను నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరు నవ్వుతో ఉత్తరుని చూసి నాకు అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహ నుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు.

అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు ఇలా అన్నాడు. "కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించితిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను.

నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది.

పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వన దహనంలో అగ్ని దేవునికి సాయపడి నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. అర్జునుడి ఈ పది నామాలే ఉన్నాయా లేక ఇంకమైనా పేర్లు ఉన్నాయా? ఉన్పాయనే చెప్పవచ్చు.

భగవద్గీతలో ఉన్న అర్జునుడి ఇతర నామాలు ఇవి. అనఘుడు, అనసూయుడు, కపిధ్వజుడు, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు కూరుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు దేహభృయాం వరుడు, పరంతపుడు, పురుషవర్ధనుడు, భరతర్షభుడు , భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, మహాబాహుడు. అమ్మో! ఒక మనిషికి ఇన్ని పేర్లా! ఇక్కడ మరో విషయం తెలుసుకోవలసినది ఉంది. పిడుగులు పడేటప్పుడు అర్జునుని దశ నామాలను తలచుకుంటే ఆ పిడుగు మనదరిదాపుల్లో పడదు, మనకు ప్రాణభయం ఉండదంటారు పెద్దలు.
-గుమ్మా నిత్యకళ్యాణమ్మ 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top