సువార్త: చెయ్యెత్తి జైకొట్టే జైత్రయాత్ర | A Motivational Bible Short Story Written By Jetham | Sakshi
Sakshi News home page

సువార్త: చెయ్యెత్తి జైకొట్టే జైత్రయాత్ర

Jun 18 2026 9:26 AM | Updated on Jun 18 2026 9:26 AM

A Motivational Bible Short Story Written By Jetham

సువార్త

బాప్తిస్మమను దేవుని సంకల్పాన్ని పరిసయ్యులు నిరాకరిస్తూ వచ్చారు. యేసు దానికి లోబడ్డాడు. ‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’ అంటూ యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు ఉత్తరమిస్తూ అతని ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఒడ్డుకు రాగానే ఆకాశం తెరువబడి దేవుని ఆత్మ పావురంవలె దిగి ఆయన మీదకు వచ్చాడు.

‘ఈయనే  నా ప్రియ కుమారుడు. ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అనే ఒక శబ్దము అది తండ్రియైన దేవుని స్వరము అనేలా ఆకాశము నుండి వచ్చింది. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ ప్రేరణ వలన అరణ్యమునకు త్రోసికొనిపోబడ్డాడు. నలుబది దినములు, రాత్రులు ఉపవాసం ఉంటూ అడవి మృగాల మధ్య గడిపాడు. యేసు ఆకలితో ఉన్న ఈ సమయాన అపవాది వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. యేసు ధీరుడిగా నిలబడి తలపడి ఆ శోధకుడను ఓడించాడు.

చెయ్యెత్తి జైకొట్టాలనే యేసు జైత్రయాత్ర సరిగ్గా ఇక్కడనే మొదలైంది. యేసు శిశువుగా ఉన్నప్పుడే ఆయన జైత్రయాత్రను, అనేక ఒడిదుడుకులలో అంతటా అట్టి విజయాన్నే చూస్తామని కొందరు అంటారు గానీ ఇది దేవుని కాపుదల, సంరక్షణ. పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, దేవుని రాజ్యాంగ చట్టనిపుణులు వంటివారు  బాలుడిగా ఉన్న యేసు ఆనాడు బోధకులను సైతం ఆలోచనల్లో పడవేసిన విధానం గుర్తు చేసుకుంటారు. ఇలా యేసు బాల్యంలోనే ఆయనదైన జైత్రయాత్ర ప్రారంభమైందనేవారు లేకపోలేదు.

ఆ వివరాలలోకి వెళితే – తన తల్లి మరియతో బాలుడిగా ఉన్న బాలయేసు ‘నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా?’ అన్నాడు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయమొందుచున్నారు.

మరల మనం మొదటికి వస్తే, సాతాను అనే శోధకుడు ఆకలితో ఉన్న యేసు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆపై కడుపారా తిని నీ ఆకలి తీర్చుకో అంటూ శోధించాడు. యేసు అతనికి ధీటుగా జవాబిచ్చాడు. ‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’ అన్నది ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉందని చె΄్పాడు.

అపవాది  పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు. దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు వచ్చి నీ పాదములు రాతికి తగులకుండ నిన్ను తమ చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడింది అంటూ అపవాది యేసువలె వాక్య వచనంతో మాట్లాడాడు. అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట  వ్రాయబడిఉన్నదని అపవాదికి చె΄్పాడు.

మరల అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండ మీదకు ఆయనను తీసికొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చెదను అంటూ ఆయనను మరీమరీ శోధించాడు. యేసు వానితో – సాతానా, ΄÷మ్ము ! ప్రభువైన  నీ దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. దీంతో అపవాది ఆయనను విడిచిపోయాడు.

యేసు అంతటి ఆకలిలోను సాతాను శోధనలకు ఏమాత్రం లొంగలేదు. స్వకీయ మహిమను ఏనాడూ వెదకకుండా తన సొంత మాటలు, జ్ఞానంతో కాక, దేవుని వాక్యపుశక్తితో శత్రువైన సాతానును ధీటుగా ఎదుర్కొని ఎదిరించిన వైనం అమోఘం. ఇక్కడి నుండే యేసు జైత్రయాత్ర మొదలైందని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ విజయయాత్ర సిలువ మరణం వరకు అప్రతిహతంగా కొనసాగింది. – జేతమ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement