శతక నీతి
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...
వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..
‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చు
త్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...
అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.
సుమతీ శతకంలో...
‘కష్టకాలమందు సహాయము చేయువాడు
త్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...
అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.
నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..
ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి


