ఇస్లాం వెలుగు
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.
కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.
అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.
మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.
ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.
మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.
ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.
– ముహమ్మద్ ముజాహిద్


