కథానీతి
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.
ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.
శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,
‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.
దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.
కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు


