
ఇంటా బయట ఆందోళనకరమైన జీవన విధానం. నిత్యం ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణలు. అయితే... ధ్యానం ద్వారా వాటిని సమతుల్యం చేసుకునే శక్తి మనకు ఉంది. ధ్యానం ఆత్మ సముద్ధరణకు ఉపయోగపడే అత్యున్నతమైన సాధనం. ఇంటిలో, సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే ముందు మనలో ప్రశాంతత కలగాలి అని వివరించారు బ్రహ్మకుమారీస్ రాజయోగిని కులదీప్ దీది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘సంత్ సమాగమమ్’ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
‘నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి పోటీ, మితిమీరిన సాంకేతికత, భావోద్వేగ సంఘర్షణల కారణంగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. ధ్యానం శక్తిమంతమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సహనాన్నిప్రోత్సహించి సామరస్యాన్ని పెంపొదిస్తుంది. మానసికంగా ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ విషయాలు అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.
యువతలో వేగవంతమైన భావోద్వేగాలు..
నేటి యువత భావోద్వేగాలకు చాలా ఎక్కువగా గురవుతోంది. వేగవంతమైన భావోద్వేగాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు, ప్రేమ గురించి విరుద్ధమైన ఆలోచనలతో వారి జీవితమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. మనం వారికి ఏం చెప్పగలం అంటే.. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా భావోద్వేగం కాదు. అది అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరమైనప్పుడు కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. లోలోపల ఖాళీగా అనిపిస్తే బయట ప్రేమ కోసం వెతకద్దు. ప్రేమ స్వీయ అవగాహనతో ్ర΄ారంభమవుతుంది. జీవితం కేవలం ఆనందం కోసం కాదు ప్రయోజనం కోసం అని గ్రహించాలి.
గృహిణులు ఇంట్లో శాంతిని నిలబెట్టాలంటే...
‘నేను ప్రశాంతమైన ఆత్మను’ అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం లేదా ధ్యానంతో రోజును ప్రారంభించాలి. కుటుంబ సభ్యులను కేవలం పాత్రలుగా కాకుండా ఆత్మలుగా చూడండి. ఇది సహనాన్ని, మంచి అవగాహనను తెస్తుంది. వంట చేసేటప్పుడు మీ ఆలోచనలను స్వచ్ఛంగా, ఉన్నతంగా ఉంచుకోండి. ఎటువంటి లక్షణాలు ఉన్న భోజనం తింటారో అటువంటి ఆలోచనలే వస్తాయి. జీవితం అలాగే తయారవుతుంది. గృహిణి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది.
మనిషి జీవితం ధ్యేయం...
‘నేను ఎవరు?’ నాది ఏది, సత్యత ఏంటీ.. అనేది గ్రహించాలి. రోజువారీ జీవితంలో శాంతి, ప్రేమ, స్వచ్ఛత వంటి అసలు లక్షణాలను వ్యక్తపరచాలి. మనం కేవలం శరీరాలు కాదు. మనం ఆత్మలం. ప్రతి ఆత్మ తన ప్రత్యేక΄ాత్రను ΄ోషించడానికి, ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడానికి ఇక్కడ ఉంది. మనం విలువలు, ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు మనం లోపల నండి సంతృప్తి చెందుతాం. ధ్యానం మనకు పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన ఉన్నత ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ‘నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానా?’ అని తమని తాము ప్రశ్నించుకోగలిగితే, మీరు సరైన మార్గంలో ఉన్నారనేదానికి అదే సంకేతం.
వెలితిగా ఉండటానికి పరిష్కారం..
బాహ్య, భౌతిక విజయం వాస్తవానికి అంతర్గత శూన్యతను పూరించదు. నిజమైన సంతృప్తి అంతర్గత శాంతి, ప్రేమ నుండి వస్తుంది. మన ఆత్మ పరమ సంబంధం కోరుకుంటుంది. మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం అర్థవంతంగా, సంతృప్తిగా భావించడం ప్రారంభిస్తాం. నిశ్శబ్దం, సరళత, ఆధ్యాత్మికత మన హృదయాన్ని నింపుతాయి. ఇవేవీ బాహ్య విజయాల ద్వారా అందవు. ఆధ్యాత్మికత తోడవ్వాలి. అంతర్గత సంపద ఉంటే వెలితి అనేదే ఉండదు’’ అని తెలిపారు ఈ రాజయోగిని.
నేను ఆత్మను అనే భావనతో అవగాహన...
‘నేను ఒక ఆత్మను’ అనే అవగాహన మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. భావోద్వేగపరంగా తక్షణమే స్పందించే బదులు, అవగాహనతో ప్రతిస్పందిస్తాం. ఇతరులను వారి రూ΄ాలతో, పనులతో కాకుండా ఆత్మలుగా చూడటం ప్రారంభించినప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవగాహన సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది.
పిల్లలపై తల్లిదండ్రుల దృష్టికోణం...
తల్లిదండ్రులు పిల్లలను ఆస్తిగా కాకుండా వారి స్వంత ప్రయాణంతో కూడిన వ్యక్తిగత ఆత్మలుగా చూడాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనవాడే. ఇతరులనుండి ప్రేరణ కలిగించవచ్చు. కాని ఇతరులతో ΄ోల్చకూడదు. ప్రేమ అంటే ప్రతి కోరికనూ నెరవేర్చడం కాదు. అలా చేస్తే వారి కోరిక తీరక΄ోతే మారాం చేయడమో, మొండిగా అవ్వటమో చేస్తారు. సమయం చూసి వారితో ప్రేమతో మాట్లాడాలి. కఠినంగా కాకుండా ప్రశాంతంగా, స్పష్టతతో మాట్లాడండి. పిల్లలు సురక్షితంగా, ప్రేమతో ఉన్నప్పుడు బాగా వింటారు. అంతర్గత బలం వారికి ప్రేమ, సరైన మార్గదర్శకత్వం రెండింటినీ ఇవ్వడానికి సహాయ పడుతుంది
– నిర్మలారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి