భూమండలాన్ని పృథు చక్రవర్తి పాలిస్తున్న రోజులలో ఒకప్పుడు ధర్మనష్టం జరిగి వర్షాలు పడక, పంటలు పండక, ప్రజలు కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చింది. కరవును భరించలేని జనం పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి ఆ భయంకర క్షామం నుండి కాపాడమని వేడుకున్నారు. అది చూసి తట్టుకోలేని పృథు చక్రవర్తి, సస్యనాశనం కావించి జనులకు ఆహారాన్ని దూరం చేసిన భూదేవిని శిక్షించడానికి పూను కున్నాడు.
భయపడిన విశ్వంభర గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు చేరింది. ఎక్కడికి వెళ్ళినా వెంబడించి పట్టుకుని శిక్షిస్తానని, తాను కూడా వెళ్ళాడు పృథు. ‘అంతగా కోపం తెచ్చుకోవడానికి నేను చేసిన తప్పేమిటి?’ అని అడిగింది భూదేవి. ‘క్షామ పరిస్థితులు సృష్టించి ప్రజలు ఆకలితో అలమటించేలా చేసిన దుష్టచారిణివి నీవు. నిన్ను శిక్షిస్తే ప్రజలు సుఖపడతారు’ అన్నాడు పృథు. ‘కరవుకు అసలు కారణం గ్రహించకుండా నీవు నన్ను శిక్షించే ఆలోచన చేస్తున్నావు. నీ ప్రజలను కాపాడుకునే ఉపాయం నేను చెబుతాను. సస్యరాశి సమస్తం, ఔషధాలు నాలో జీర్ణమై ఉన్నాయి. గోరూపంలో ఉన్న నాకు సంతానం కలిగితే, పాల రూపంలో అవన్నీ మళ్ళీ భూమిపై ప్రవహించి, బీజములు మొలకెత్తి, పంటలు సమృద్ధిగా పండుతాయి. కనుక అలా చెయ్యి’ అని సలహా ఇచ్చింది.
ఆలోచించిన పృథు చక్రవర్తి, పర్వత శ్రేణులతో ఎత్తుపల్లాలుగా ఉన్న భూమిని చదును చేశాడు. గ్రామాలు, పట్టణాలు నిర్మింపజేశాడు. కాయకష్టం చేయడానికి జీవనోపకరణాలను తయారు చేయించి అందరికీ సమ కూర్చాడు. అలా అంతటినీ వ్యవస్థీకృతం చేసి భూదేవి సలహా ప్రకారంగా చేయడానికి ఇలా పూనుకున్నాడని వెన్నెలకంటి సూరన ‘శ్రీవిష్ణుపురాణం’, ప్రథమాశ్వాసంలో చెప్పాడు.
కం. పాయక భూధేనువునకు / స్వాయంభువు గ్రేపుగాగ సమకట్టి మహీ
నాయకుడు పిదికె దుగ్ధ/ ప్రాయంబై జగములెల్ల బరిపూర్ణముగాన్.
గోరూపంలో ఉన్న భూదేవికి స్వాయంభువ మనువును దూడగా చేసి పృథు చక్రవర్తి పాలు పితికి భూమండలం మొత్తం తడిసేలా చేశాడని పై పద్యంభావం. ఆ చర్యతో భూమి మళ్ళీ సారవంతమై పంటలు పండి ప్రజలు సుఖించారని ‘శ్రీవిష్ణుపురాణం’లోని పృథు చక్రవర్తి కథ చెబుతోంది.
– భట్టు వెంకటరావు


