ప్రాచీన కాలంలో గురుముఖ విద్యకే ప్రాధాన్యం. విద్య అనేది గురు శుశ్రూష వలన, తమ దగ్గర ఉన్న ఒక విద్యనిచ్చి వారి నుండి మరొక విద్య గ్రహించటం అనే పద్ధతులలో ఉండేది. గురువు లేకుండా విద్యనార్జించటం అసాధ్యం. గురువు స్వయంగా చెబితేనే విద్య గ్రహించాలి. ఇతరులకు చెబుతున్నపుడు, అనుమతి లేకుండా విద్య గ్రహించటం కూడా తప్పే! అదీ నాటి పరిస్థితి.
ద్వాపర యుగంలో కురు పాండవ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం పట్ల విముఖుడైన అర్జునునికికృష్ణుడు భగవద్గీత రూపంలో తత్వార్థాన్ని బోధించాడు. బోధించాక, ‘నీకు బాగా అర్థమైందా?’ అనడుగుతాడు.
అర్జునుడు, ‘అర్థమయ్యింది కానీ మళ్ళీ వినాలనుకుంటున్నాను, సంక్షిప్తంగా చెప్పమ’ ని అంటాడు. అప్పుడు అర్జునుని ధ్వజంపై ఉన్న హనుమ ‘నేను ఈ బ్రహ్మ విద్యను సమస్తం గ్రహించాను. నా హృదయంలో అది స్థిరంగా ఉంది. నేను నీకు తర్వాత చెపుతాను. ఇది యుద్ధ సమయం. వృథా ఆలోచనలు మాని యుద్ధం చేయి’ అంటాడు.
ఇదీ చదవండి: ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?
అపుడు కృష్ణుడు హనుమంతునితో, ‘నా అనుమతి లేకుండా నువ్వు బ్రహ్మ విద్య నెలా గ్రహించావు? గురువాజ్ఞ లేకుండా విద్య గ్రహించిన వానికి పిశాచత్వం కలుగుతుంది. నువ్వు విద్వాంసుడవై కూడా ఇలా ఎందుకు చేసావు?’ అన్నాడు. హనుమ ధ్వజాగ్రం నుండి దిగి వచ్చి, వినయంగా, ‘నాకు బ్రహ్మ విద్య ఎలా సఫల మౌతుంది? పిశా చత్వం ఎలా పోతుంది?’ అని ప్రార్థించగా, కృష్ణుడు కౌరవుల యుద్ధం ముగిసిన వెంటనే ‘నీ పిశాచత్వం తొలగి పోతుంది. సేతువు వద్ద స్నానం చేసి రామేశ్వరుని ఆర్చించు. తర్వాత నువ్వు ఈ గీతా శాస్త్రానికి భాష్యం రాయి. ఈ భాష్య రచనకు నీ కన్నా సమర్థులు లేరు. నీ ద్వారా ఈ శాస్త్రం విఖ్యాత మౌతుంది’ అన్నాడు. హనుమంతుడు గీతకు అద్భుతమైన భాష్యం రాశాడు. ఈ భాష్యం వలన భగవద్గీతలోని విశేషార్థాలు, సామా న్యార్థాలు అవగతమవుతాయని ‘పరాశర సంహిత’ తెలుపుతోంది.
చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?
– డా.చెంగల్వ రామలక్ష్మి


