క్రీస్తు కంటే ముందు పుట్టి, ఈ నేలపై క్రీస్తు మార్గం సరాళం చేయడానికి శ్రమించినవాడు యోహాను. ఆనాటి ప్రజల్ని దేవునివైపు తిప్పుతూ, వస్తాడు నా దేవుడంటూ ప్రజలకు నీళ్ళతో బాప్తిస్మం ఇస్తూ, ఓ చైతన్య జ్వాలలా అరణ్య ప్రాంతాల్లో దైవ స్వరం వినిపించిన సంచార స్వరాల ప్రయోక్త, మహా భక్త బాప్తిస్మ యోహాను.
‘స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు’– ఈ మాటలు మరియతో ఎలిజబెత్ అన్నది. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భవతి. అన్నది ఎలిజబెత్. విన్నది మరియ. అక్కడ ఉన్నది వీరిద్దరే. కానీ ఆ మాటల్ని మరియతో పాటు ఇంకా మరో ఇద్దరు విన్నారు. ఒకరు ఎలిజబెత్తమ్మ గర్భంలోని బాప్తిస్మ యోహాను, మరొకరు మరియ గర్భంలోని యేసు.
యేసు గురించి గర్భస్థ శిశువుగా విన్నాడు కాబట్టే, ఆయన ఔన్నత్యాన్ని ఘంటాపథంగా లోకానికి చాటగలుగు తున్నాడు యోహాను! లోకంలో జరిగే మంచీ చేడుల్ని చూచినవి చూచినట్టుగా ప్రజలకి వివరిస్తూ, రాచరికంలోని వైనా ఘాటుగా విమర్శించేస్తున్నాడు. ప్రజలంతా ఆయన్ను ఓ అడవిలో అన్నగా గుర్తిస్తే, రాచరికం మాత్రం ఓ తిరుగు బాటుదారునిగా గుర్తించింది.
ఫిలిప్పు భార్య హేరోదియ. ఆమె తన భర్త ఫిలిప్పును వదిలేసి, అతని తమ్ముడు హేరోదు అంతిపస్‌ని పెళ్లి చేసుకుంది. అంతిపసు ప్రస్తుతం ఆ గలిలయ రాజు. ఓసారి తన ప్రసంగంలో ‘నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయము కాదు’ అని రాజును బహిరంగంగా ఖండించాడు. అగ్గిమీద గుగ్గిలమైంది రాజు కాడు, హేరోదియ.
హేరోదియకు ఓ కూతురు. పేరు సలోమి. ఆరితేరిన నర్తకి. ఓ రోజు ఆడింది పాడింది, ఆ రాజును మెప్పించింది. ఏమి కావాలో కోరుకోమన్నాడు రాజు. తల్లిచేసిన దుర్బోధలచే సలోమి యోహాను శిరస్సు కోరుకొంది. సరే అన్నాడు రాజు. మరుక్షణంలోనే పళ్ళెరాన యోహాను శిరస్సు! కానీ మరణంనుంచే గలిలయలో కొత్త విప్లవం ఆవిర్భవించింది. యోహాను స్ఫూర్తి ఖండఖండాలకు పాకింది. – డా‘‘ దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 24న బాప్తిస్మ యోహాను జన్మదినం)


