
ఒకరోజు ఒకతను ఒక ముని దగ్గరకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ‘జ్ఞానం అంటే ఏమిటి? నేను కలిసిన కొందరు ఒక్కోలా చెప్పారు... మరి మీరేమంటారో తెలుసుకోవాలని ఉంది’ అన్నాడు. ‘జ్ఞానం అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మరచిపోవడం కాదు... బాధలో అలసిసొలసి డీలా పడిపోవడం కాదు. కష్టమో సుఖమో దేనికైనా స్థిరంగా ఉండటం ముఖ్యం’ అన్నారు ముని.
‘మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?’ అని అడిగా డతను. అంతట ఆ ముని ‘నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చు కున్నాను’ అన్నారు. ‘ఏమిటి మీరు చెప్తున్నది? అది ఎలా సాధ్యం?’ అని అడిగాడు మునిని.
ఒక గాడిద ఆ దారిన పోతోంది. ముని దాని వంక చూడమన్నారు. ‘ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని. నదిలో మురికి బట్టలన్నింటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటిబాట పడతాడు. మనం ఆ గాడిదలా ఉండాలి. ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని అదేమీ బాధపడలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టల మూటలని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవదు. దేన్ని చూసీ అది చలించలేదు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను’.
అలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం. సుఖమైనా, కష్టమైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. ఎవరు బోధిస్తారనేది ముఖ్యం కాదు. గురువు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం.
– యామిజాల జగదీశ్