సువార్త
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.
జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.
కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.
ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.
యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.
ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్


