సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు.. | Laughter And Health Written By Dr Kandala Satyanarayana Murthy | Sakshi
Sakshi News home page

సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..

Jul 9 2026 12:26 PM | Updated on Jul 9 2026 12:41 PM

Laughter And Health Written By Dr Kandala Satyanarayana Murthy

శతకనీతి

వ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే  అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్‌ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.

సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...
‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీ
తల్లిదండ్రి నాధులతోడన్‌
నవ్వకుమీ పరసతితో 
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘
తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..

వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.
అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.

‘మనసునందు మాలిన్యంబు మానకుండా
మాటలందు మైత్రి నాటింపనేల
లోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.

నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.
‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..
‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.
మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.

‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతు జూచి కాలుండు నవ్వును ‘
ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..

ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.
భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..
సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement