తత్త్వ దర్శిని
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.
మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.
శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.
అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు


