ఆధ్యాత్మికతతో సమతుల్యత | Explanation of spiritual life | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతతో సమతుల్యత

May 25 2026 6:28 AM | Updated on May 25 2026 6:28 AM

Explanation of spiritual life

మంచి మాట

యాంత్రిక జీవనంలో మనిషి డబ్బు, హోదా వెనుక పరుగెత్తుతూ తనను తాను మర్చిపోతున్నాడు. సౌకర్యాలు పెరిగినా సంతోషం తగ్గుతోంది. ఈ క్రమంలో మనకు సమతుల్యతను నేర్పేది ఆధ్యాత్మికత ఒక్కటే! ఆధ్యాత్మిక జీవనంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు... అంతకుమించిన అపోహలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో... ఆధ్యాత్మిక జీవనం అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం...

ఆధ్యాత్మికత అనేది కేవలం మతం లేదా పూజా కార్యక్రమాలకు పరిమితమైనది కాదు. ఇది ఒక వ్యక్తి తన అంతరాత్మను తెలుసుకోవడానికి, విశ్వ చైతన్యంతో అనుసంధానం కావడానికి చేసే నిరంతర ప్రయాణం. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు మనల్ని మనం గమనించుకోవడం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపతాపాలు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవడమే ప్రాథమిక చైతన్యం. ‘నేను కేవలం ఈ శరీరాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన శక్తిన’ని గుర్తించడం ఇందులో ముఖ్యం (ఆత్మ వివేచన). లోకంలో తప్పులను వెతకడం మానేసి, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. రోజులో కొంత సమయం మౌనంగా ఉంటూ, తన ఆలోచనలను గమనించుకుంటూ స్వీయ నియంత్రణ పాటించడం.

ప్రస్తుత సమాజంలో మన జీవన విధానంలో అడుగడుగునా ఉద్వేగం, ఉద్రేకం, అనవసరమైన వేగం, వత్తిడి ఎక్కువయ్యాయి. ఓ పసిపిల్లకు నూటికి 98 మార్కులొస్తే వచ్చే సంతోషంకన్నా 2 మార్కులు పోయాయన్న బాధే ఎక్కువగా కనిపిస్తున్నది. చిన్న పార్శ్వం ఇది. ఒక పుస్తకంలో చదివి నేర్చుకునేది ఆధ్యాత్మికత కాదు, అనుభవపూర్వకంగా పొందాల్సింది. నిత్యం కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, ప్రకృతిని గమనించడం, సాత్విక గుణాలను పెంపొందించుకోవడం ద్వారా ఎవరైనా ఈ మార్గంలో పయనించవచ్చు. అంతిమంగా, మనలోని దైవత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మిక శిఖరం.

యువతరం ఆధ్యాత్మికతను ఒక పాతకాలపు ఆచారంగా కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించే ఒక శక్తిమంతమైన సాధనంగా స్వీకరించాలి. ఇది వ్యక్తిగత వికాసానికి, మానసిక ప్రశాంతతకు సార్థకమైన జీవితానికి మార్గం చూపుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది బాహ్య వేషధారణలోనో, మంత్రతంత్రాల్లోనో లేదు. అది మనిషి ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో ప్రతిబింబించే పరిణతి. మన హృదయం ఎంత విశాలమైతే, మనం అంత ఆధ్యాత్మికంగా ఉన్నామని అర్థం.

కేవలం ధ్యానం చేయడమే ఆధ్యాత్మికత కాదు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువుల పట్ల, ప్రకృతి పట్ల దయ కలిగి ఉండటం నిజమైన ఆధ్యాత్మిక లక్షణం. విశ్వంలోని ప్రతి జీవిలోనూ ఆ దైవత్వాన్ని చూడటమే దీని పరమార్థం. క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారిలో నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు నిండిన నేటి కాలంలో ఆధ్యాత్మికత ఒక మందులా పనిచేస్తుంది. ధ్యానం... ప్రార్థన మనస్సును నిలకడగా ఉంచుతాయి. ఉన్నదానితో తృప్తి చెందుతూ, లేనిదాని కోసం ఆరాటపడకుండా ప్రశాంతంగా ఉండటం అలవడుతుంది.

ఆధ్యాత్మికత అలవడిన వ్యక్తికి చావు, పుట్టుకల పట్ల భయం ఉండదు. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించే పరిణతి వస్తుంది. అనవసరమైన వాదనలు, చర్చల కంటే మౌనంగా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. లోపల ప్రశాంతత ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలోని శబ్దాలు వారిని ఇబ్బంది పెట్టవు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారు అసంతృప్తికి లోనుకాకుండా, ఆ సమయాన్ని ఆత్మ విమర్శకు వాడుకుంటారు.
 
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement