అంతా ఆచార్యుడి నిర్ణయమే..! | The Story Of Acharya Bhakti Written By Visweswaravarma Bhupatiraju | Sakshi
Sakshi News home page

అంతా ఆచార్యుడి నిర్ణయమే..!

Jun 25 2026 8:18 AM | Updated on Jun 25 2026 8:18 AM

The Story Of Acharya Bhakti Written By Visweswaravarma Bhupatiraju

కథానీతి

‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.

‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .
‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .
‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.
‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.

నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.

చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement