మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం! | A Moral Shataka Neethi Story Written By Dr Kandala Satyanarayana Murthy. | Sakshi
Sakshi News home page

మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!

Jun 25 2026 9:07 AM | Updated on Jun 25 2026 9:07 AM

A Moral Shataka Neethi Story Written By Dr Kandala Satyanarayana Murthy.

శతక నీతి: క్షమాగుణం

మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..

‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కును
క్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...
సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..
‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’

భాస్కర శతకంలో ...
‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు 
క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.
భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...

రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో 
‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు 
క్షమ లేని తపము వ్యర్థ తపంబు 
క్షమ లేని దానము కల్మష దానంబు 
క్షమ లేని మాన్యత కపట మాన్యత’..
క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.

కుమార శతకంలో 
‘క్షమయే పరమధర్మము 
క్షమయే పరమ సుఖము 
క్షమయే పరమవిద్యయు 
క్షమయే పరమ గతి 
క్షమలేని యోగము, భోగము పనికిరాదు 
క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.

సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.
నారాయణ శతకంలో 
‘క్షమయే విష్ణురూపంబు 
క్షమయే పరబ్రహ్మము 
క్షమయే జగతికి ఆధారము 
క్షమయే నిజమైన భక్తి 
క్షమించేవాడు నరుడు 
మిగిలిన వారెల్ల పశువులు’...

చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి

నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement