
నాకో సందేహం ఉంది డాక్టరు గారూ... గత 6 నెలలనుంచి మా ఇంటి పక్కన ఉండే ఆవిడకి దేవత పూనుతోంది. ఆ సమయంలో ఆమెకి అమ్మవారు పూని భవిష్యత్తు చెప్పడం, అలాగే ఇతరుల సమస్యలకి సమాధానం / పరిష్కారాలు చెబుతుంది. వారంలో 3 రోజులు ఇలా జరుగుతుంది. దాంతో మా ్ర΄ాంతం అంతా ఒక జాతరలా తయారైంది. ఆమెను అడిగితే తనకి ఏమీ గుర్తులేదు అని చెప్తుంది. వారంలో మిగిలిన రోజులు మామూలుగానే ఉంటుంది. భర్త తాగుబోతు, పిల్లలు ఏమీ పనిచేయరు. ఈమే కూలి పని చేసి వాళ్ళని పోషించాలి. భర్త తాగివచ్చి ప్రతిరోజు హింసించేవాడు. ఎప్పటినుంచి ఆమెకు పూనడం మొదలైందో, అప్పటినుండి అతను తాగడం మానేసి పనికి వెళ్తున్నాడు. పిల్లలు ఆమె మాట వింటున్నారు. భక్తులు ఇచ్చే కానుకలతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగైంది. అసలు పూనకాలనేవి నిజంగా ఉంటాయా? లేక ఆవిడ కావాలనే ఇలా చేస్తోందా? చాలా సందర్భాలలో పూనకాల గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే. దయచేసి నా సందేహాలకు సమాధానం చెప్పగలరు.
– తిరుపతి, వరంగల్
ఎవరైనా ఒక వ్యక్తి విపరీతమైన ఒత్తిడికి, దీర్ఘకాలంగా అణిచివేతకు గురైనపుడు, లేదా మనసులో ఏదైనా తీరని కోర్కెలు, ఆలోచనలు ఉన్నప్పుడు. వారికి తెలియకుండానే ఇలా ఒక వేరే వ్యక్తిలా లేదా దేవత పూనినట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘డిసోసియేటివ్ ట్రాన్స్‘ లేదా ΄పొసెషన్ స్టేట్‘ అంటారు. ఇలాంటి స్థితిలో ఆ వ్యక్తులు ఎలాంటి భయాలూ, ఒత్తిళ్లూ లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. ఆత్మన్యూనతా భావం ఉండే వారిలో కూడా, ఈ ‘΄పొసెషన్ స్టేట్’ ఎక్కువగా కనబడుతుంది. అయితే కొంతమంది తమ స్వార్థం లేదా లాభాపేక్ష కోసం, ఇలా పూనకం వచ్చినట్లు నటించొచ్చు, అయితే వాటిని ’ట్రాన్స్ స్టేట్’ కింద పరిగణించలేము. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు
మన సమాజంలో ఇలా దేవుడు ఆవహించిన వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. హారతులు ఇవ్వడం, కొబ్బరి కాయలు కొట్టడం, దండలు వేయడం వంటి వాటితో వారిని ప్రత్యేకంగా కూడా చూస్తారు. దీనివల్ల ఆ వ్యక్తికి కొంతయినా ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వారిలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అణిచివేతకు గురయిన వాళ్ళలో ఒక పవర్ వచ్చిన భావన కూడా కలుగుతుంది. ఎక్కువగా స్త్రీలు ఇలాంటి ఇబ్బందులకు గురవుతారు, ఓర్పు, సహనం వంటి వాటిని కూడా స్త్రీలలో ఎక్కువగా చూస్తుంటాము. రోజు తాగి వచ్చి కొట్టే ఆమె భర్త ఇప్పుడు ఆమెలోని దేవతకి, భక్తితోను, భయంతోనూ గౌరవిస్తూ మారాడు. పిల్లలు మారి తన మాట వింటున్నారు. నిజానికి ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి, సమాజంలో, కుటుంబంలో ఆమెకు గౌరవం స్థానం కల్పిస్తే వారిలో వచ్చే అనేక మానసిక సమస్యలను నివారించవచ్చు: మీ పక్కింటావిడకి దేవత రావడం వల్ల ఏదైనా ఇబ్బందిగా అన్పించినా, లేదా తన ఇష్టానికి వ్యతిరేకంగా పూనకం వచ్చినా వారు పరీక్షించి డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలు ఏదైనా ఉండి ఆమెకి సహాయం కావాలని అన్పించినా వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలిస్తే కౌన్సెలింగ్, తగిన చికిత్స అందిస్తారు. ఆల్ ది బెస్ట్
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)