రెవెన్యూ అధికారులపై హైకోర్టు మండిపాటు
రాష్ట్రంలో చెరువులకూ ఇష్టారాజ్యంగా పట్టాలు
రెవెన్యూ శాఖను రద్దు చేస్తేగానీ దారికి రారు
ఎఫ్‌టీఎల్ జోన్ భూములకు పాస్ బుక్కులా?
రెవెన్యూ, నీటిపారుదల శాఖలది ద్వంద్వ నీతి
అటు పట్టాలు.. ఇటు కోర్టుల్లో విరుద్ధ కౌంటర్లు
చెరువుల కబ్జాపై న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు
ఖమ్మం కలెక్టర్ వారంలో కౌంటర్ వేయాలని ఆదేశం
పర్యావరణ హననానికి ఎలాంటి విపత్తులు కారణం కాదు. మనిషే బాధ్యుడు. సర్కార్ భూములే కాదు.. చెరువులనూ వదలడం లేదు. వాస్తవ స్థితిని పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు వారికి పట్టాలు జారీ చేస్తున్నారు. కోర్టుల ఆదేశాలన్నా లెక్కలేదు. ఎఫ్‌టీఎల్ భూములకూ పట్టాలిచ్చేస్తున్నారు. ఇటు కోర్టుల్లో అందుకు విరుద్ధంగా కౌంటర్లు వేస్తున్నారు. అధికారులది ద్వంద్వ నీతి.
చెరువుల నడిమధ్య భూమికి పట్టాలు జారీ చేస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 37 ఎకరాల చెరువు భూమిలో ఓ మాజీ ఎమ్మెల్యేకు 27 ఎకరాలకు పట్టా జారీ చేశారు. పాస్ పుస్తకాలతో సహా అతను పిటిషన్ వేశారు. అధికారుల తీరు క్షంతవ్యం కాదు అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ, నీటి పారుదల అధికారుల తీరు పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వాస్తవ స్థితిని పరిశీలించకుండా ఇష్టమొచ్చినట్టు పట్టాలు జారీ చేస్తున్నా రని ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఆ ఆధారాలతో వారంతా న్యాయస్థానా ల్లో పిటిషన్లు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. రెవెన్యూ శాఖను రద్దు చేస్తే గానీ ఈ దేశం బాగుపడదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం అడవిమల్లెల సర్వే నంబర్ 11, 12, 13, 29, 30, 31లోని తమ పట్టా భూమిని మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ వ్యవసాయదారుడు బోనం సంజీవరెడ్డి సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. పట్టా భూమిని చెరువుగా పేర్కొంటూ మిషన్ కాకతీయలో చేర్చడంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ తీరు సరికాదన్నారు.
కనీసం పిటిషనర్ల భూమిని సేకరించలేదని వారికి నోటీసులైనా జారీ చేయలేదన్నారు. అధికారుల నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. పిటిషనర్ల పట్టా భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కలెక్టర్ రాకుంటే చర్యలు తప్పవు
కొత్త ప్రాజెక్టు కట్టేప్పుడు మాత్రమే భూ సేకరణ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా పరిహారం ఇచ్చే అవకాశం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెంచితే వారి భూములు మునిగిపోతాయి కదా అని అడిగారు. ప్రైవేట్ భూమిపై అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా నీటిమట్టం పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం అధికారులకు ఉందని ఏజీపీ బదులిచ్చారు.
పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఏజీపీ కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ చెరువులో 27 ఎకరాలు పట్టా భూమి అని ఓ మాజీ ఎమ్మెల్యే ఈ కోర్టుకు వచ్చారు. చెరువు మొత్తం ఏరియా 37 ఎకరాలు. 37 ఎకరాల్లో 27 ఎకరాలకు ఎలా పట్టా ఇచ్చారో అధికారులకే తెలియాలి. అధికారుల తప్పిదానికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాలని మరవొద్దు. ఎఫ్‌టీఎల్ భూములనీ అధికారులంటారు.. పట్టా భూములని ప్రైవేట్ వ్యక్తులంటారు.
ఖమ్మం కేసులో 29 సర్వే నంబర్ భూమి స్వభావ పట్టా.. భూమి వివరణ మెట్ట అని అధికారులే పేర్కొన్నారు. కానీ, 29 సర్వే నంబర్ పూర్తిగా చెరువు మధ్యలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ధారించని కారణంగానే ఇలాంటి పిటిషన్లన్నీ వస్తున్నాయి. రెవెన్యూశాఖను తొలగిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు’అని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఈ కోర్టు తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.


