
మోదీ నాకు చాలా మంచి మిత్రుడు: ట్రంప్
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లోనే మోదీతో సంభాషిస్తానని తెలిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. ఈ చర్చలు విజయవంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చర్చలను సానుకూలమైన ముగింపునకు తీసుకురావడంలో ఇబ్బందులేవీ లేవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
భారత్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్, అమెరికా నడుమ వాణిజ్యపరమైన అవరోధాలు కచ్చితంగా తొలగించుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలను బలహీనపర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్ తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. ‘‘మోదీ గొప్ప ప్రధానమంత్రి. ఆయన నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. మేము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం’’ అని ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో వ్యాఖ్యానించారు.