ఇస్లాం వెలుగు
విశిష్టమైన ముహర్రమ్ మొదటి 10 రోజులు
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.
1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.
ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.
2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలు
ఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:
ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.
దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.
పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.
దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.
ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.
జీవిత పాఠం
ఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.
త్యాగాల స్మరణ...
ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
– ముహమ్మద్ ముజాహిద్


