సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా! | Islam Velugu Devotional Story Written By Muhammad Mujahid | Sakshi
Sakshi News home page

సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!

Jul 2 2026 8:52 AM | Updated on Jul 2 2026 8:52 AM

Islam Velugu Devotional Story Written By Muhammad Mujahid

ఇస్లాం వెలుగు

లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.

ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!

శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయం
ఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.

ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్‌ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.

ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

జీవితాన్ని మార్చే ‘బరకత్‌’ (దైవిక అనుగ్రహం)
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్‌’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్‌ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్‌! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.

షైతాను సంకెళ్ళను తెంచేయండి
మనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం
1. మీరు నిద్ర లేచి అల్లాహ్‌ను స్మరించుకున్న క్షణంలో 
       మొదటి ముడి విడిపోతుంది.
2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) 
       చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.
3. ప్రార్థన (నమాజ్‌) లో దేవుని ముందు 
       నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.
ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్‌ ముజాహిద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement