సాక్షి, కాకినాడ: ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు వైఎస్సార్‌సీపీ నేతలు. అరుదైన రాజకీయ నాయకుడు ముద్రగడ. ఆయనను స్పూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రగడకు ఎంతో గౌరవం ఉందన్నారు.
నేడు కిర్లంపూడిలో మద్రగడ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అంబటి రాంబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, గుడివాడ అమర్నాధ్, కరణం ధర్మశ్రీ, తానేటి వనిత, వేణుగోపాల కృష్ణ, వంగా గీతా, దవులూరి దొరబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘ముద్రగడుకు ఆయనకు ఆయనే సాటీ. ఏ కార్యక్రమం చేసిన ఒక ధృడ సంకల్పంతో చేశారు. తాను చనిపోయాక ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులను ఒప్పించి సంస్మరణ సభ నిర్వహించాం. ముద్రగడ సంస్మరణ సభ రాజకీయ సభ కాదు. రాజకీయాల కంటే కాపు ఉద్యమంలోనే ముద్రగడతో నాకు ఎక్కువ సన్నిహిత సంబంధం ఉంది. ముద్రగడ ఒక శక్తి. రంగాను పోగొట్టుకున్నాము ముద్రగడను పోగొట్టుకోలేమని దాసరి ఆనాడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముద్రగడకు ఎంతో గౌరవం ఉంది.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో సామాజిక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఏ విషయం తీసుకున్నారో దానిని సాధించుకునేంత వరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టేవారు. అరుదైన రాజకీయ నాయకుడు ముద్రగడ. పదవులు ఆయన్ను వరించాయి తప్ప.. ఆయన పదవుల కోసం పాకులాడలేదు. ముద్రగడ రాజీనామాలు స్పూర్తినిచ్చాయి. ముద్రగడను స్పూర్తిగా తీసుకుని పోరాట పటిమతో ముందుకు సాగాలన్నారు.

జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘రాజకీయాల్లో ముద్రగడ విలువలతో కూడిన శాసనం. ఆతిథ్యం పేరు చెబితే ఏపీలో ముద్రగడను మించిన వారు లేరు. ముద్రగడ కోసం ఎంత మాట్లాడిన తక్కువే. పట్టుదల విషయంలో ముద్రగడ ఆయనకు ఆయనే సాటి. కాపు నేతగా ముద్రపడ్డా.. కులాలకు, మతాలకు అతీతంగా ముద్రగడ రాజకీయాలు చేశారు. ముద్రగడ లేరు అనే బాధ ఎక్కువగా ఉంది. ముద్రగడను అనుసరించిన ఆయన ఇల్లాలు పద్మావతికి నమస్కారం. ముద్రగడ ప్రతీ ఉద్యమంలో ఆయన సతీమణీ పద్మావతి ముద్ర ఉంది’ అని చెప్పుకొచ్చారు.


