హైదరాబాద్‌లో మందకొడిగా మ్యాపింగ్
రాష్ట్రంలో దూసుకెళ్తున్న గ్రామీణ జిల్లాలు
91.07% మ్యాపింగ్‌తో అగ్రస్థానంలో జనగామ జిల్లా
అత్యల్పంగా మేడ్చల్‌లో 35.85%, హైదరాబాద్‌లో 42.82%
రాష్ట్రంలో ఇంకా 1.15 కోట్లకు పైగా ఓటర్ల నమోదు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)కు ముందు చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ (ప్రీ సర్) ప్రక్రియ నగర ప్రాంతాల్లో ఆశించిన వేగంతో సాగడం లేదు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ శాతం మ్యాపింగ్ ఎన్నికల యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 42.82 శాతం మ్యాపింగ్ మాత్రమే జరగడం గమనార్హం. అయితే జిల్లాల్లోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ గణనీయంగా ముందంజలో ఉంది. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని 3.39 కోట్ల మంది ఓటర్లలో 2.23 కోట్ల మందిని (65.95 శాతం) మాత్రమే 2002 ‘సర్’జాబితాలతో మ్యాపింగ్ చేయగలిగారు. ఇంకా 1.15 కోట్లకు పైగా ఓటర్లు మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇందులో అర్బన్ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి.
ముషీరాబాద్‌లో అత్యల్పం
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.10 లక్షల మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు సుమారు 20.17 లక్షల మందిని మాత్రమే మ్యాప్ చేయగలిగారు. ఇంకా దాదాపు 26.92 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సి ఉంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో.. ముషీరాబాద్ (34.33 శాతం), నాంపల్లి (37.59 శాతం), జూబ్లీహిల్స్ (38.09 శాతం), సనత్‌నగర్ (39.80 శాతం), సికింద్రాబాద్ (40.12 శాతం)లో అత్యల్పంగా మ్యాపింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో వలస జనాభా ఎక్కువగా ఉండటం, తరచూ చిరునామాలు మారడం, అద్దె ఇళ్లలో నివసించే వారు ఎక్కువగా ఉండటం, పాత కుటుంబ వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు మ్యాపింగ్‌కు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే..మలక్‌పేటలో 41.92 శాతం, అంబర్‌పేట్‌లో 41.40, ఖైరతాబాద్‌లో 46.30, కార్వాన్‌లో 50.64, గోషామహల్‌లో 42.45, చార్మినార్‌లో 47.68, చాంద్రాయణగుట్టలో 42.39, యాకుత్‌పురాలో 45.22, బహదూర్‌పురాలో 51.65, కంటోన్మెంట్‌లో 42.38 శాతం మ్యాపింగ్ జరిగింది. పాతబస్తీ పరిధిలోని బహదూర్‌పురా, కార్వాన్‌లలో అత్యధికంగా జరగడం విశేషం.
మేడ్చల్‌లో మరీ దారుణం
క్యూర్ పరిధిలో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ మ్యాపింగ్ కేవలం 35.85 శాతం మాత్రమే నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 51.59 శాతం మ్యాపింగ్ నమోదైనా, రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది కూడా చాలా తక్కువే. ఐటీ ఉద్యోగులు, వలస జనాభా, కొత్తగా ఏర్పడిన కాలనీలు, అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరగడం వల్ల కుటుంబ వారసత్వ ఓటరు వివరాలను గుర్తించడం కష్టమవుతోందని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు.
గ్రామీణ జిల్లాలు ముందంజలో..
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉండగా, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలున్న జిల్లాల్లో మాత్రం మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ జిల్లా 91.07 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. మహబూబాబాద్ లో 90.83%, యాదాద్రి–భువనగిరిలో 86.32% మ్యాపింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల స్థిర నివాసం, తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసించడం, కుటుంబ సభ్యుల వివరాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల మ్యాపింగ్ సులభతరమయ్యింది. కుమురంభీమ్ ఆసిఫాబాద్‌లో దాదాపు 78 శాతం, మంచిర్యాల 71, ఆదిలాబాద్ 70, నిర్మల్ 78, నిజామాబాద్ 80, కామారెడ్డి 78, జగిత్యాల 76, పెద్దపల్లి 76, కరీంనగర్ 75, రాజన్న సిరిసిల్ల 77, సంగారెడ్డి 61, మెదక్ 82, సిద్దిపేట 85, రంగారెడ్డి 51, వికారాబాద్ 74, మేడ్చల్ మల్కాజిగిరి దాదాపు 36, హైదరాబాద్ 42, మహబూబ్‌నగర్ 74, నాగర్‌కర్నూల్ 75, వనపర్తి 80, జోగుళాంబ గద్వాల 77, నల్లగొండ 80, సూర్యాపేట 76, వరంగల్ 71, హనుమకొండ 69, జయశంకర్ భూపాలపల్లి 72, భద్రాద్రి 77, ఖమ్మం 70, ములుగు 81, నారాయణపేటలో 83 శాతం మ్యాపింగ్ జరిగింది.
జూన్ 25 నుంచి ఇంటింటి ధ్రువీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ¯25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియకు కీలకమైన ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అంటే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి ముందుగానే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఓటరును కనీసం మూడుసార్లు సంప్రదించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఓటర్లు స్వయంగా కూడా ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫామ్స్ సమర్పించవచ్చు.
నగరాల్లో సవాలే..
ఈ ప్రీ సర్ లేదా మ్యాపింగ్ ప్రక్రియ నగర ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారుతోంది. జూన్ 25 నుంచి కేవలం నెలరోజుల వ్యవధిలో జరిగే ఈ ప్రక్రియలో ఇంకా భారీ స్థాయిలో ధ్రువీకరణ జరగాల్సి ఉండటంతో, నగరాల్లో అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్‌లో మ్యాపింగ్ ఐదారు నెలలుగా కొనసాగుతోంది. అయినా అంతంత మాత్రంగానే మ్యాపింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెల రోజుల్లో కీలక సర్వే ఎలా చేయగలుగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు మ్యాపింగ్ అంటే ఏమిటి?
ప్రతి ఓటరును 2002 ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాతో అనుసంధానం (లింకింగ్) చేయాల్సి ఉంది. ఓటరు సొంత నమోదు లేదా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతల వివరాల ఆధారంగా ఈ లింకింగ్ జరుగుతుంది. ఈ కుటుంబ లింకింగ్ విజయవంతంగా పూర్తైతే అదనంగా పత్రాలేవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. లింక్ కాని ఓటర్లకు తర్వాతి దశలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట పత్రాలు సమర్పించాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు.


