పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్‌కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్‌లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్‌లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు.
కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్‌కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది.
వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్‌తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్‌లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే.
నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్‌మ్యాప్‌డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.
ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్‌లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది.


