ఉర్దూ మాట్లాడేవారు 20 శాతానికి పైగా ఉంటే.. అక్కడ ఉర్దూ ఫారాల పంపిణీని పరిశీలించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు.
అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్‌ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్‌కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్‌వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్‌లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు.
ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్‌వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్‌లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి.
తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్‌వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్‌లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు.


