మై టీడీపీ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈఆర్వో హోదాలో ఉన్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్ మంత్రి నారాయణతో చర్చించిన ఆడియోను వినిపిస్తున్న వైఎస్ జగన్
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ సానుభూతి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం
మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ ఓట్ల తొలగింపునకు తెగబడుతున్న దారుణం
ఇలాగైతే పేదలు ఎలా బతుకుతారు.. ఏ దేశం పౌరులవుతారు?
చేతనైతే ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించాలి
స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్‌లో వారికి పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా.. వేయరా.. అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయం కాదు. - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన పతనం ఖాయమని నిశ్చయించుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాటా్లడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫామ్స్ జారీ చేయకుండానే ఇచ్చేసినట్టు రాసేసుకోవాలని చంద్రబాబు ఆర్డీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారని మండిపడ్డారు.
ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించలేదనే సాకుతో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించే కుట్రకు తెరలేపుతున్నారన్నారు. అసలీ మనిషికి మానవత్వం ఉందా.. అని ప్రశ్నించారు. ‘స్వార్థ రాజకీయం కోసం పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్‌లో పథకాలు ఎలా వస్తాయి? పథకాలు నిలిచిపోతే పేదలు ఎలా బతుకుతారు? ఓటును తొలగిస్తే వాళ్లు ఏ రాష్ట్రం, ఏ దేశం పౌరులు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? నీకు ఓటు వేస్తారా? వేయరా? అనేది ముఖ్యం కాదు. చేతనైతే మంచి చేసి, ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు సంపాదించు. అలాకాకుండా ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి ఓట్లను తొలగించడం న్యాయమా? ఓట్లు తొలగించాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
ఇందు కోసం మై టీడీపీ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈఆర్వో హోదాలో ఉన్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్.. మంత్రి నారాయణతో చర్చించిన ఆడియో బయటకు వచ్చింది. ఇలా నేరుగా మంత్రులు అధికారులతో మాట్లాడుతూ టీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు. అధికారులు దగ్గరుండి దుర్మార్గాలు చేస్తుంటే వ్యవస్థలు ఎలా బాగుపడతాయి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


