తెలంగాణలో ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా ఇచ్చే అవకాశం
12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ
ఆ సమయానికి రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు
ఇప్పటివరకు 70.02% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
89.55 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లు ఉన్నట్లు గుర్తింపు
వారందరికీ నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం
జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను స్తంభింపజేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ పంపిణీ చేసేందుకు పేర్లు, ఇతర పాక్షిక వివరాలతో ‘సర్’ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తోంది. ఓటర్ల జాబితాను స్తంభింపజేశాక ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్ కార్యక్రమం నిర్వహించగా అప్పటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లతో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను సర్–2026లో భాగంగా మ్యాపింగ్ చేస్తోంది. ప్రస్తుత ఓటర్లు 2002 జాబితాలో తమ పేరైనా లేక తల్లిదండ్రులు/నాయనమ్మ/తాతయ్యల పేర్లను అయినా కలిగి ఉంటేనే మ్యాపింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్‌ను ఇప్పటివరకు పూర్తి చేశారు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల పేర్లు/తల్లిదండ్రుల పేర్లు/బంధుత్వం/చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్‌వేర్ గుర్తించింది.
సర్ కార్యక్రమంలో భాగంగా జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటిసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 26.47 శాతం మందికి ఈసీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని వారిని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాతే మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీన విచారణకు హాజరు కావాలని కోరనున్నారు.
ఆరుగురికన్నా ఎక్కువ సంతానమున్నా నోటీసులు...
‘సర్’నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనామలీస్(అనుమానస్పద) ఓటర్ల జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు, ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త), తండ్రికి, బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం (ఉదాహరణకు తండ్రి, కుమారుడికి మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం), ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్‌వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే రాష్ట్రంలో 89.55 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, అనుమానాలున్నట్లు సాఫ్ట్‌వేర్ గుర్తించిందని అధికారులు తెలిపారు.
మ్యాపింగ్ యథాతథంగా కొనసాగింపు...
సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్తంభింపజేసినా మ్యాపింగ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదై ఉన్న వారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయనుండగా జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో భాగంగా అవకాశం కల్పిస్తారు. 18 ఏళ్లు నిండి ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి బీఎల్‌ఓలు ఫారం–6 దరఖాస్తుతోపాటు ఒక స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వాటిని నింపి తిరిగి బీఎల్‌ఓకు అందజేయాలి. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది ‘సర్’ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారు.


