ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP complains about TDP's interference in voter registration revision | Sakshi
Sakshi News home page

ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Jun 24 2026 5:10 AM | Updated on Jun 24 2026 5:10 AM

YSRCP complains about TDP's interference in voter registration revision

నెల్లూరు ఓటర్ల జాబితా సవరణ సమీక్షలో మంత్రి నారాయణ హాజరుపై అభ్యంతరం 

ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో టీడీపీకి చెందిన మంత్రులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారికి  ఫిర్యాదు చేశారు. 

జూన్‌ 22న నెల్లూరు నగరంలో మున్సిపల్‌ శాఖ మంత్రి  పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్‌ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్, అడిషనల్‌ కమిషనర్ల సమక్షంలో ఓటర్ల సవరణ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించిన విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక సమావేశానికి పెద్దసంఖ్యలో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) హాజరుకావడంపై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.   

రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ అనేది కేవలం ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియ అని, ఇందులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఓటర్లలో, రాజకీయ పార్టీలలో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

నెల్లూరులో జరిగిన  సమీక్షా సమావేశంపై తక్షణమే విచారణ జరిపించాలని, నిబంధనలను ఉల్లంఘించి, రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ ముగిసేవరకు సదరు సమావేశానికి సహకరించిన అధికారులందరినీ తక్షణమే ఎన్నికల విధుల నుండి తొలగించాలని కోరారు. భవిష్యత్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల సవరణ ప్రక్రియల్లో, సమీక్షల్లో పాల్గొనకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement