‘సర్’ పేరుతో ఇప్పటికే 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారు
దేశమంతా ‘సర్’ పూర్తయ్యేసరికి 16.5 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారు
వీధి పోరాటాలతోనే ఓట్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం
ప్రముఖ ఆరి్థక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్) అనేది ఒక రక్తపాత రహిత రాజకీయ నరమేధమని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. ఇప్పటి వరకు పాలకులను ఓటర్లు ఎన్నుకుంటున్నారని, అయితే సర్ ప్రక్రియ ద్వారా ఎవరు ఓటర్లుగా ఉండాలనేది పాలకులు నిర్ణయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను పూర్తి చేసి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారని చెప్పారు. దేశమంతటా సర్ ప్రక్రియ పూర్తయ్యే సరికి 16.5 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
విశాలాంధ్ర దినపత్రిక 74వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ఆంతర్యం–సవాళ్లు’ అంశంపై సదస్సు నిర్వహించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సర్ అనేది కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమం అని మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
వాస్తవానికి దానికి వెనుక వేరే రహస్య అజెండా ఉందన్నారు. కేవలం కొన్ని వర్గాల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా సర్ చేపట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. 2002లో నిర్వహించిన ‘సర్’లో ఓటర్లు తమ అర్హతలను నిరూపించుకునేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదన్నారు. ఇప్పుడు కచ్చితంగా డాక్యుమెంట్లు సమర్పించాలని నిబంధన విధించారని తెలిపారు. దీనివల్ల కనీస పరిజ్ఞానం లేని దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, రోజువారీ కూలీలు భారీగా ఓట్లు కోల్పోతున్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. తెలంగాణలోనూ దాదాపు 88 లక్షలమంది ఓటర్ల మ్యాపింగ్ జరగలేదని ప్రకటించారని, అంటే అక్కడా ఆ ఓట్లలో అత్యధికం తొలగించే అవకాశం ఉందన్నారు.
ఎటువంటి సమీక్ష లేకుండానే...
బిహార్‌లో సర్ ప్రక్రియ అనంతరం సుమారు 63 లక్షల మంది ఓట్లు తొలగించడంతో వివాదాలు చెలరేగినా, ఎన్నికల సంఘం కనీసం సమీక్ష చేయకుండానే ముందుకు వెళుతోందని పరకాల చెప్పారు. సర్ ప్రక్రియ ప్రభావం కేవలం ఒకటి, రెండు ఎన్నికలకే పరిమితం కాదన్నారు. దీనివల్ల దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివారుగా పౌరులను విభజించే పరిస్థితి వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా అత్యంత దారుణంగా చేస్తున్నారని చెప్పారు. ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధి పోరాటాలు ఒక్కటే శరణ్యమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ సర్‌పై రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. విశాలాంధ్ర ఎడిటర్ ఆర్‌వీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


