ఓటు కోసం కోటి కష్టాలు! సరిగ్గా జరగడం లేదు ‘సర్‌’! | Enumeration forms not available in many places in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఓటు కోసం కోటి కష్టాలు! సరిగ్గా జరగడం లేదు ‘సర్‌’!

Jul 5 2026 5:06 AM | Updated on Jul 5 2026 5:06 AM

Enumeration forms not available in many places in Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లా సవర కుడ్డబలో ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపుతున్న విద్యార్థులు

ఓటర్లకు అవగాహన లేదు.. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు శిక్షణ లేదు

చాలా చోట్ల అందని ఎన్యూమరేషన్‌ ఫారాలు 

ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రాసేసుకుంటున్న అధికారులు 

ఫారాలు నింపడం తెలియక ఓటర్ల ఇక్కట్లు 

తాము నింపడానికి సమయం సరిపోవడం లేదంటున్న బీఎల్‌వోలు

వివరాలు లేవన్న సాకుతో సచివాలయాల్లో పేరుకుపోతున్న ఫారాలు 

2002 ఓటరు జాబితాలో పేర్లు లేని ఓటర్ల పరిస్థితి ఘోరం

గత వివరాల కోసం సొంతూళ్లకు, పక్క గ్రామాలకు పరుగులు 

ఫారాలు నింపడానికి కొన్ని సచివాలయాల్లో డబ్బుల వసూళ్లు 

మరో 10 రోజులే మిగిలి ఉండడంతో ఓటర్లలో భయం.. సగం కూడా పూర్తికాని డిజిటైజేషన్‌.. బీఎల్‌వోలపై నెపం వేస్తున్న పై అధికారులు 

అధికారపార్టీ నేతలు చెప్పిన వారికే ఫారాలు

రోజూ వాళ్లనే సంప్రదిస్తున్నామంటున్న బీఎల్‌వోలు

నేను కాశీబుగ్గ శ్రీనివాసనగర్‌లో ఉంటున్నా. ఇంత వరకు ఎవరూ ఎన్యూమరేషన్‌ పత్రం ఇవ్వలేదు. మా వీధికి వచ్చిన వారిని అడిగితే ఇక్కడ కాదని అంటున్నారు. మా సొంతూరు అంబుసోలి వెళ్తే అక్కడ ఏమీ తెలియదంటున్నారు. మా ఇంటిలో 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికీ ఫారాలు ఇవ్వలేదు.  
– కోనేటి కుమారి, శ్రీనివాసనగర్, కాశీబుగ్గ   

సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – సర్‌) కార్యక్రమానికి ఇక మిగిలింది పదిరోజులే.. ఓటును కాపాడు కోవడం కోసం ఓటర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి ఎన్యూమరేషన్‌ ఫారాలే అందలేదు. తీసుకున్న వారు వాటిని ఎలా పూర్తి చేసి ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకు కూర్చుంటున్నారు. సర్‌ కార్యక్రమంపై ఓటర్లకు సమగ్ర అవగాహన కలిగించకుండా, బీఎల్‌వోలకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వకుండా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరి ఓట్లు మిగులుతాయో, ఎవరి ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆందోళనలో అందరూ ఉన్నారు. 

జూన్‌ 15న మొదలైన ‘సర్‌’ కార్యక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది.  రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా.. శనివారం నాటికి 2,00,46,384 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ వివరాలు డిజిటలైజ్‌ చేయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇరవై రోజుల్లో సగం మాత్రమే పూర్తికావడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్‌వోలు సతమతమవుతున్నారు. ఓటర్లలో చాలామందికి ఈ ఫారాలు ఎలా పూర్తిచేయాలో తెలియడం లేదు. మీరే పూర్తిచేయండి అంటూ ఇచ్చేస్తున్నారని బీఎల్‌వోలు అంటున్నారు. వివరాలు లేకుండా ఇస్తున్న ఫారాలు సచివాలయాలలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్‌ ప్రక్రియ ఎలా సాగుతుందో ‘సాక్షి’ పరిశీలించింది. 

ఫారాలు ఇవ్వకుండానే... 
అధికారుల ఒత్తిడి భరించలేక బీఎల్‌వోలు చాలా చోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమయ్యింది. గత నాలుగు రోజుల నుంచి ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్‌ ఫారాలు 100 శాతం ఇచ్చేసినట్లు ప్రతి రోజు విడుదల చేస్తున్న నివేదికల్లో వెల్లడిస్తోంది. కానీ  క్షేత్ర స్థాయిలో చూస్తే ఇప్పటికీ చాలా మందికి ఫారాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. చాలా మంది ఓటర్లు ఎక్కడున్నది తెలియకపోయినా పై అధికారుల ఒత్తిడితో ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు పలువురు బీఎల్‌వోలు తెలిపారు. ముందు రికార్డుల్లో ఇచ్చేసినట్లు చూపించండి ఆ తర్వాత డిజిటలైజేషన్‌ సమయంలో ఏం చేయాలో చెప్తామనడంతో 100 శాతం ఇచ్చేసినట్లు చూపించినట్లు బీఎల్‌వోలు చెబుతున్నారు. 

2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ సమస్య.. 
సర్‌ ప్రక్రియలో ప్రధాన సమస్య 2002 ఓటర్ల జాబితాల్లో పేరు లేని ఓటర్లే. ఆ ఓటర్ల సమగ్ర సమాచారం సేకరించడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఉండే మొత్తం ఓటర్లలో కనీసం 20 శాతం మంది ఈ 24 ఏళ్ల కాలంలో పెళ్లిళ్ల కారణంగా అత్తారి ఊళ్లో ఓటు న మోదు చేసుకున్న వారు, మరో ఊరు వలస వచ్చిన వారి ఓట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు ఓటు వివరాలను వారు 2002 నివాసం ఉన్న ప్రాంత వివరాలతో మ్యాపింగ్‌ చేసేలా నిబంధనలు పెట్టడంతో లక్షలాది ఓటర్లు తమ ఓటును కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్లు సైతం ‘సర్‌’ నిబంధనలు తెలియక తికమక పడుతున్నారు.  

ఉద్యోగ రీత్యా వేరొక చోట నివాసం ఉండే వాళ్లు లేదా కొడుకులు, కూతుళ్ల వద్ద ఉంటున్న తల్లిదండ్రులు తాము తాత్కాలికంగా అక్కడ నివాసం ఉంటున్నా, సొంత ఊరిలో ఓటు కాపాడుకోవడానికి బంధువుల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారని బీఎల్‌వోలు పేర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గం పాతమాగులూరు గ్రామానికి చెందిన చల్లా శేషమ్మ  గుంటూరులో కొడుకు వద్ద నివాసం ఉంటూ, సర్‌ కార్యక్రమంలో ఊళ్లో ఉన్న తన ఓటు నిలుపుకునేందుకు శుక్రవారం పాతమాగులూరు వచ్చి తమ బీఎల్‌వోకు ఏమేమి వివరాలు ఇవ్వాలో అడిగి తెలుసుకుని మరీ తమ వివరాలు నమోదు చేసుకోవడం ‘సాక్షి ’ ప్రతినిధి కంట పడింది.  

ఫారాలు పక్కన పడేస్తున్నారు.. 
2002 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేకుండా తరువాత ఓటు హక్కు వచ్చిన వారు ఎన్యూమరేషన్‌ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరిగా లేవని, పేర్లలో తేడాలున్నాయని రకరకాల సాకులు చూపి­స్తూ డిజిటైజేషన్‌ చేయడంలేదు. అలా చాలా ఎన్యూ­మరేషన్‌ ఫారాలను పక్కన పడేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామ పరిధిలోని 1042 ఓటర్లు ఉన్న 117 నెంబరు పోలింగ్‌ బూత్‌ పరిధిలో  53 మంది ఫారాల్లో వివరాలు సరిగా లేవంటూ పక్కన పడేశారు. 

అధికారపార్టీ బీఎల్‌ఏలను సంప్రదిస్తున్నాం.. 
అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకే బీఎల్‌వోలు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇస్తున్నారని, కొంతమందికి ఫారాలు ఇవ్వకుండా సచివాలయాలకు వచ్చి సంప్రదించాలని చెబుతున్నారని చాలాచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఓటర్ల ఇళ్ల వివరాలు తెలియక తాము అధికారపార్టీ నియమించిన బీఎల్‌ఏలకు రోజూ ఫోన్లు చేస్తున్నమాట నిజమేనని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఓ బీఎల్‌వో పేర్కొన్నారు. ‘‘ఓటర్లకు పంచిన ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకుందామని ఇళ్లకు వెళ్లితే చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులు పనులకు పోయారని చెబుతున్నారు. ఉదయానే వెళ్లినా పనులకు పోతున్నాం, సాయంత్రం రమ్మంటున్నారు.’’ అని బీఎల్‌వోలు చెబుతున్నారు. ‘ఫారాలు మేమే పూర్తి చేయాల్సి రావడంతో సర్‌ కార్యక్రమం వేగంగా ముందుకు సాగడం లేదు’ అని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బీఎల్‌వో వివరించారు. 

మొరాయిస్తున్న యాప్‌.. 
ఇవన్నీ ఓక ఎత్తయితే ఆన్‌లైన్‌ సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి.  సర్‌ కార్యక్రమంలో ఓటరు ఇచ్చే ఎన్యూమరేషన్‌ ఫారాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే బీఎల్‌వోల మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ రోజూ సాయంత్రం అయితే మొరాయిస్తోంది. కనీ­సం లాగిన్‌ అవడానికి వీలులేకుండా యాప్‌ ఓపెన్‌ కావడం లేదని బీఎల్‌వోలు అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల మధ్య తరచూ ఈ సమస్య తలెత్తుతోందని, సమస్య తలెత్తినప్పుడు కనీసం 20 నిమిషాలు యాప్‌ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుందని బీఎల్‌వోలు అంటున్నారు.  

‘ఆధార్‌’ వివరాలు ఎందుకు అడుగుతున్నట్లు? 
ఎన్నికల సంఘం ‘సర్‌’ కార్యక్రమ నిబంధనల్లో ప్రతి ఓటరు తల్లిదండ్రుల వివరాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్‌ నెంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పనిసరికాదు. కానీ బీఎల్‌వోలు ప్రతి ఓటరు నుంచి ఆధార్‌ వివరాలు కూడా సేకరిస్తున్నారు.  తమ ఎన్యూమరేషన్‌ ఫారాలలో ఆధార్‌ వివరాలు లేకుండా ఇస్తే తిరిగి ఆధార్‌ వివరాలు తీసుకురండి అంటూ బీఎల్‌వోలు ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు ఆధార్‌ వివరాలు తప్పనిసరి అంటూ ఓటర్లను భయపెట్టి ఆ వివరాలు సేకరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సొంతంగా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ వివరాలు నమోదు చేసుకోవడానికే ఆధార్‌ అవసరమవుతుంది. కానీ అలా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు అసలు పేరు ముందు వెనకా తారుమారు కావడంతో ఆన్‌లైన్‌ కావడంలేదు. అలాగే ఆధార్‌తో ఫోన్‌ అనుసంధానం కాక, ఓటీపీ రాక ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు కావడం లేదని అంటున్నారు.

గడువు పొడిగింపు కోసం..  
దాదాపు సగం మంది ఓటర్ల వివరాలు నమోదు ఇంకా జరగాల్సి ఉండడంతో కార్యక్రమం గడువు పొడిగించాలని బీఎల్‌వోలు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని పోలింగ్‌ బూత్‌లలో 60 శాతం ప్రక్రియ పూర్తయినపటికీ... 25 శాతం కూడ పూర్తికాని బూత్‌లు ఒక్కో మండలంలో పదుల సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం నాటికి ఇంకా 25 శాతం ప్రక్రియ కూడ పూర్తి కాని పోలింగ్‌ బూత్‌లు 24 దాక ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని పొడిగించాల్సిందిగా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు కోరడం గమనార్హం. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే లక్షలాది మంది ఓటును కోల్పోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు.  

మమ అనిపించాలనే తొందర...
‘సర్‌’ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు చేస్తున్న హడావిడి చూస్తుంటే తూతూమంత్రంలా మమ అనిపించేయాలన్నట్లే కనిపిస్తోందని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులు క్షేత్రస్థాయి సమస్యలతో సంబంధం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని కేవలం అక్కడ ఇంత శాతం అయ్యింది, వాళ్లు మొదటిస్థానంలో ఉన్నారు మీరు ఎందుకు వెనకున్నారని అడుగుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం లేదని బీఎల్‌వోలు పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్‌లో మేమంటే మేము ముందుండాలని జిల్లాలు పోటీ పడుతూ ఆయా కలెక్టర్లు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదని వారంటున్నారు.

పనులకు వెళ్లేటప్పుడు వస్తే ఎలా..? 
సవర కుడ్డబ గ్రామంలో సుమారు 56 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. బీఎల్‌వో కనీసం సమాచారం ఇవ్వకుండా.. అందరూ పనులకు వెళ్లే సమయంలో గ్రామానికి వస్తే ఎలా. మేమే బాధ్యత తీసుకుని చదువుకున్న వారితో ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపించాం. అయినా ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు ఫారాలు ఇవ్వలేదు.     
– సవర వెంకటేశ్‌, సవర కుడ్డబ గ్రామం, శ్రీకాకుళం జిల్లా

వివరాలు నింపడానికి డబ్బులా? 
వివరాలు ఫారంలో నింపకపోతే ఓటు పోతుందని అధికారులు భయపెట్టారు. సచివాలయంలో వాళ్లు పెట్టిన ఓ వ్యక్తి తనవద్ద డబ్బులు వసూలు చేశాడు. నాకు చదువు రాదు. ఐదు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఇపుడు నా ఓటును కాపాడుకోవడానికి డబ్బులివ్వాల్సి రావడం బాధనిపించింది.  
     – వెంకటేశ్వరరావు, ఎనికేపాడు, కృష్ణా జిల్లా  

ఊళ్లో వివరాలు తెలియడం లేదు.. 
నాకు పెళ్లి అయినప్పటి నుంచి మా ఊళ్లోనే ఓటు ఉంది. ఓటరు ఐడీ కార్డు జీజీవీ 2596393. కానీ, మా అమ్మవాళ్ల వివరాలు కావాలంట. అమ్మానాన్న ఫొటోలు, ఆ జిల్లా, నియోజకవర్గం, మండలం,  ఓటు వేసిన వార్డు నెంబరు ఇవ్వమంటున్నారు. మా అమ్మవాళ్లకి ఫోను చేసి అడిగితే వాళ్లు తెలియదంటున్నారు. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఏమి చేయాలి మేం?     
– షేక్‌ సైదాబీ, పాతమాగులూరు, ప్రకాశం జిల్లా   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement