రక్తపాతం లేని నరమేధమే ‘సర్‌’ | Parakala Prabhakar about Irregularities in Voter List | Sakshi
Sakshi News home page

రక్తపాతం లేని నరమేధమే ‘సర్‌’

Apr 20 2026 4:24 AM | Updated on Apr 20 2026 4:24 AM

Parakala Prabhakar about Irregularities in Voter List

రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి

ఈసీ ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తే ఉద్యమాలు చేపడతాం

గ్రామసభలు పెట్టి ఓటర్‌ లిస్ట్‌ తయారు చేయాలి

తెలంగాణ ఓటర్ల ‘సర్‌’పై అవగాహన సదస్సులో పరకాల ప్రభాకర్‌

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో రక్తపాతం లేని నరమేధమే కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్‌’ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ అని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లను ఏరివేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో ఇప్పటికే 6.5 కోట్ల ఓట్లను ‘సర్‌’ పేరుతో తొలగించిందని దుయ్యబట్టారు. దీన్ని ప్రజలు తేలికగా తీసుకోరాదని హెచ్చరించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఓటర్ల ‘సర్‌’పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘సర్‌’ను ఎందుకు తీసుకొచ్చారో ఎన్నికల సంఘం వద్దే సరైన సమాధానం లేదని ఆయన విమర్శించారు.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రశ్నలు అడిగితే సమాధానాలు కరువు అవుతున్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ‘సర్‌’ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఓటర్ల ప్రక్షాళన చేపట్టి ఓటర్ల జాబితా తయారు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఓట్లు తొలగిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అందరూ ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరకాల సూచించారు. 

బిహార్‌లో 63 లక్షల ఓట్ల తొలగింపుపై స్పష్టత ఏదీ? 
బిహార్‌లో 63 లక్షల ఓటర్లను తొలగించామని ఈసీ చెబుతోందని.. కానీ ఎవరిని తొలగించారనే విషయంపై మాత్రం స్పష్ట­త ఇవ్వలేదని పరకాల చెప్పారు. పదేపదే కోర్టులను ఆశ్రయించినా ఈసీ దానిపై మాట్లాడటం లేదన్నారు. తొలగించే ఓటర్ల జాబితాలో ఎక్కువగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం లేదన్నారు. 

‘సర్‌’లో చొరబాటుదారులనే పదమే లేదు.. 
ఈసీ చేపడుతున్న ఓట్ల తొలగింపులో షిఫ్టెడ్, డెత్, డిలీట్‌ అని మాత్రమే రాసి ఉందని.. చొరబాటుదారులనే కాలమే లేదని పరకాల చెప్పారు. అక్రమంగా ఉన్న విదేశీయుల ఓట్ల తొలగింపు కోసమే ‘సర్‌’ ప్రక్రియ జరుగుతోందంటూ బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటోందని.. మరి తొలగించే ఓట్ల జాబితాలో ఆ కాలమ్‌ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. 

మూడు నియోజకవర్గాలలో నమూనా సర్వే చేస్తే నకిలీ చిరునామాలతో 80 వేల ఓట్లు కొత్తగా చేర్చినట్లు తేలిందన్నారు. అలాంటప్పుడు ‘సర్‌’ సమర్థవంతమైన ప్రక్రియ ఎలా అవుతుందని పరకాల ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ జి. విద్యాసాగర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. రామచంద్రమూర్తి, డీజీ నర్సింహారావు, ఉమామహేశ్వరరావు, డీఏఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement