‘సర్‌’లో టీడీపీ చొరబాటు! | TDP app named SIR aims to remove YSRCP votes | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో టీడీపీ చొరబాటు!

Jun 16 2026 5:03 AM | Updated on Jun 16 2026 7:02 AM

TDP app named SIR aims to remove YSRCP votes

వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగింపే లక్ష్యంగా టీడీపీ రూపొందించిన యాప్‌

వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ‘సర్‌’ పేరుతో టీడీపీ యాప్‌

‘సర్‌’ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు 

ఓటర్ల కులం.. ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలు ఆరా 

ఆ సమాచారం మొత్తం టీడీపీ యాప్‌లో నిక్షిప్తం.. 

ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు 

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫారం–7 వాడాలని ఆదేశం.. ఒక్కో ఏజెంట్‌.. ఆ బూత్‌ పరిధిలో కనీసం 50 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించాలంటూ టార్గెట్లు 

ఎన్నికల అధికారుల వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్‌ జిరాక్స్‌లు, సాఫ్ట్‌ కాపీలు టీడీపీ బీఎల్‌ఏల వాట్సాప్‌లలో ప్రత్యక్షం.. విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు 

ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడవటమేనని సర్వత్రా తీవ్ర ఆందోళన.. 2019లోనూ ఇదే తరహాలో ‘సేవామిత్ర’ యాప్‌ రూపొందించిన టీడీపీ.. 

ఆ యాప్‌ ద్వారా వైఎస్సార్‌సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించిన వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదా­రులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్‌ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్‌’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేస్తోంది. 

టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్‌ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్‌ జిరా­క్స్‌లు, సాఫ్ట్‌ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్‌­ఏల వాట్సాప్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్‌ కాపీల కలర్‌ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్‌ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన బీఎల్‌వోలకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ లిస్ట్‌ మాత్రమే ఇవ్వ­డం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్‌ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రి­యలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.

టీడీపీ కార్యాలయంలో బీఎల్‌ఏలకు ప్రత్యేక శిక్షణ
ప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్‌ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్‌’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్‌ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్‌పోర్టు’లో సర్‌ పేరుతో టీడీపీ ఒక యాప్‌ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్‌ ఫోటోలతో కూడిన మాస్టర్‌ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగా­నికి తెగబడింది. 

ఈ మాస్టర్‌ డేటాను బూత్‌లవారీగా ఓటర్ల కలర్‌ ఫోటోలతో యాప్‌లో అప్‌లోడ్‌ చేసి టీడీపీ బూత్‌ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరి­స్తున్నారు. ఓటరు బూత్‌ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్‌ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్‌ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్‌ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.

టీడీపీ రూపొందించిన యాప్‌లో ‘సర్‌’ విభాగం   

ఒక్కో టీడీపీ బీఎల్‌ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్‌
ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్‌సీపీ మద్దతు­దారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెర­తీశారు.ప్రతీ బీఎల్‌ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్‌ఏ 50 వర­కు ఫారం –7 దరఖాస్తులను బల్క్‌గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికా­రులపై ఒత్తిడి తెచ్చి బీఎల్‌వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. 
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్‌ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది.  ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్‌తో పాటు లోకేశ్‌ సన్నిహి­తుడు కిలారు రాజేశ్‌ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్‌ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్‌ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్‌ కన్వీనర్‌కు సేవా మిత్ర యాప్‌లో అందుబాటులో ఉంచారు. 

వాటి ద్వారా ఓటర్‌ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతి­పరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్‌కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్‌లైన్‌లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్‌ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్‌ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్‌’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement