సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో కనీసం 10 వేల పోస్టులను నోటిఫికేషన్‌లో చేర్చేలా చూడాలని కోరారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ సీఎంకు విన్నవించారు.
జేఏసీ ప్రతినిధుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని పునరుద్ఘాటించారు. నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


