దీక్షా‌ శిబిరంపై బోండా ఉమ దాడి.. డీజీపీ ఆఫీసుకి వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Delegation Meets AP DGP: Protests TDP Attacks & Security Lapses | Sakshi
Sakshi News home page

దీక్షా‌ శిబిరంపై బోండా ఉమ దాడి.. డీజీపీ ఆఫీసుకి వైఎస్సార్‌సీపీ నేతలు

Aug 6 2026 6:25 PM | Updated on Aug 6 2026 6:30 PM

  YSRCP Delegation Approaches AP DGP

తాడేపల్లి: ఏపీ డీజీపీ కార్యాలయానికి గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారు. వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, తదితరులు ఉన్నారు. విజయవాడలో పార్టీ దీక్షా‌ శిబిరంపై బోండా ఉమ చేసిన దాడిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులపై నేతలు ఫిర్యాదులు చేయనున్నారు. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల వైఫల్యాలపై కూడా ఫిర్యాదు చేశారు.

అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ... ‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై దీక్షలు చేస్తుంటే టెంట్లు పీకేస్తున్నారు. పోలీసులే ఇలా వ్యవహరించటం దారుణం. విజయవాడలో బోండా ఉమ తన మనుషులతో దాడులు చేశారు. 

కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? రాక్షస పాలనలో ఉన్నామా? అనిపిస్తోంది. నిన్న దేవరపల్లికి జగన్ వస్తే తొలుత అన్ని పర్మిషన్ లు ఇచ్చారు. కానీ రాత్రికి రాత్రి పోలీసులను విత్ డ్రా చేసుకున్నారు. జగన్ పర్యటనలో ఎక్కడా ఒక్క పోలీసు కూడా లేడు. మాజీ సీఎం పర్యటనకు వెళ్తే ఎందుకు అన్ని కుట్రలు? వీటన్నింటిపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వచ్చాం. లా అండ్ ఆర్డర్ డీజీ ఫకీరప్ప మా వినతి పత్రాన్ని తీసుకున్నారు. డీజీపీకి అందిస్తానన్నారు’’ అని తెలిపారు.

టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు..
లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పోలీసులే మా దీక్షా శిబిరాలను తొలగించటం దుర్మార్గం. కొన్ని చోట్ల టీడీపీ నేతలే టెంట్లు తొలగించారు. విజయవాడలో మల్లాది విష్ణు రిలే దీక్షలో కూర్చుంటే బోండా ఉమా దాడి చేశారు. దౌర్జన్యం చేసి టెంట్ పీకేశారు. కోడి గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. సీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడి జరగటం సిగ్గుచేటు.

దీక్షా శిబిరం పైన మూత్రం పోయటం అమానుష చర్య. ఇవన్నీ డీఐజీకి తెలిపాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడటంపై ఫిర్యాదు చేశాం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ఫిర్యాదు చేయటానికి వస్తే డీజీపీ ఎప్పటిలాగే డీజీపీ అందుబాటులోకి రాలేదు. విజయవాడలో దాడి చేసిన వారిని వదిలేసి, మల్లాది విష్ణును అరెస్టు చేశారు. 
పోలీసులు తప్పుడు మార్గంలో వెళ్లవద్దు. టీడీపీ నేతల మాటలు విని తప్పు చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు.

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయవాడ ఘటన అమానవీయం. మల్లాది విష్ణుపై దాడి దుర్మార్గం. శిబిరంపై మూత్రం పోయటం అమానుష చర్య. ఇలాంటి ఘటనలను ప్రజలు సహించరు. ఈ ఘటనలపై పూర్తి విచారణ జరపాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. శిబిరాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement