బెంగాల్ తొలి విడతలో 92.72%.. తమిళనాడులో 85.14%
రెండు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఓటర్లు
చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
ఎస్‌ఐఆర్ తర్వాత తొలి ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సినీ నటులు
ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నాం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
కోల్‌కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.
రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్‌లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్‌లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్‌లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.
పశ్చిమ బెంగాల్‌లో స్వల్ప హింస
బెంగాల్‌లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది.
బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్‌లోని ఖరిసోల్‌లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్‌ను తాత్కాలిక నిలిపివేశారు.
స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై దాడి జరిగిందని, అసన్‌సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి.
నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్‌పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్‌కల్‌లో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్‌లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్‌లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.
తమిళనాడులో అంతా ప్రశాంతం
అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది.
విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్‌కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్‌ను కొనసాగించారు.
కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్‌లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్‌లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే
తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్‌ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్‌లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది.
తమిళనాట ఓటింగ్ సరళి
తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.


