ఏంటి ‘సర్’.. అర్థమయ్యిందా లేదా...?
ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నారా...
అందకపోతే వెంటనే బీఎల్‌ఓను పట్టుకోండి
నో యువర్ బీఎల్‌ఓ యాప్ ఉపయోగించుకోండి
వేరే ఊళ్లలో, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నా ఆన్‌లైన్‌లో ఫామ్స్ పంపండి..
2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడండి
12 ధ్రువీకరణ పత్రాలలో ఏదో ఒకటి సిద్ధం చేసుకోండి
ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఇస్తేనే మీ ఓటు కొనసాగుతుంది
జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు
అందులో మీ పేరు లేకుంటే ఆగస్టు 20లోగా అభ్యంతరం తెలియచేయాలి
వాటిని పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు..
అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు పోయినట్లే..
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఇంటింటి సర్వే మొదలై పది రోజులు దాటింది. ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికి తిరిగి 60 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం పూర్తైంది. ఇప్పుడే కీలక అంకం మొదలు కానుంది. తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తిరిగి ఇస్తేనే మీ ఓటు హక్కు కొనసాగుతుంది. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోని వారు తక్షణం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం..
ఇది చాలా ముఖ్యం
ప్రతి ఒక్కరూ 2002 ఓటరు జాబితా చెక్ చేసుకోవాలి..
» జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది
https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో “సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్‌ఐఆర్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.
» 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే ఎటువంటి అదనపు వివరాలూ బీఎల్‌వోకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
» మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారంలో “గత ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు’’ అనే కాలంలో వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది.
» ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు (అందుబాటులో ఉంటే ఇవ్వాలి. తప్పనిసరి కాదు)
» బంధువు పేరు (తండ్రి లేదా తల్లి), జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది.
ధ్రువీకరణ కోసం ఈ పత్రాలలో ఏదో ఒకటి దగ్గర ఉంచుకోండి..
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగి గుర్తింపు కార్డు లేదా పెన్షన్ గుర్తింపు కార్డు
2. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు
3. జనన ధ్రువీకరణ పత్రం
4. పాస్‌పోర్టు
5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు
6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం
7. అటవీ హక్కులకు చెందిన పత్రం
8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు
9. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్
10. రాష్ట్ర, స్థానిక అథార్టీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్
11. ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్
12. ఆధార్ కోసం 9.9.2025న కమిషన్‌జారీ చేసిన ఆదేశాలు

2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే..
» ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఎవరికీ 2002 ఓటరు జాబితాలో పేరు ఉండే అవకాశం లేదు. కాబట్టి వీరంతా తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే.. మీ తండ్రి లేదా తల్లి 2002లో ఎక్కడ ఓటు కలిగి ఉన్నారనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది.
» ఇందుకోసం మీకిచ్చిన ఎన్యూమరేషన్ ఫారం రెండో కాలమ్‌లో “గత ఎస్‌ఆఐర్‌లో ముందు కాలమ్‌లో పేర్కొన్న బంధువు వివరాలు’’ పూర్తి చేయాల్సి ఉంటుంది.
» ఇక్కడ తండ్రి పేరు, తండ్రి ఓటరు కార్డు నెంబరు, బంధువు పేరు అన్న చోట తాత పేరు, అలాగే మీ తండ్రి ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం, బూత్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ పత్రాలు లేని ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఆ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం కానుంది.
బీఎల్‌ఓ మీ వద్దకు రాకపోతే..
» మొత్తం ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో)దే కీలక పాత్ర.
» ఇప్పటివరకు బీఎల్‌వో మీ ఇంటికి రాకపోతే
తక్షణం వారిని సంప్రదించండి.
» మీ బీఎల్‌వో ఎవరు? అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
» voters.eci.gov.in లేదా ‘ఈసీఐనెట్’ యాప్‌లో ‘నో యువర్ బీఎల్‌వో’ లేదా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో’ ఆప్షన్ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్‌వో పేరు, ఫోన్ నెంబరు లాంటి వివరాలు పొందవచ్చు.
» ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, 2024 ఓటరు జాబితాలోని చిరునామా నుంచి ఇల్లు మారినవారు బీఎల్వోను సంప్రదించడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చు.
ఒక ఫారం మీ దగ్గరే..
» ప్రతీ బీఎల్‌వో మీ ఫొటో వివరాలు ముద్రించిన రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు.
» ఇందులో ఒక ఫారం మీ దగ్గర ఉంచుకొని ఇంకొకటి మీ బీఎల్‌వోకి ఇవ్వాలి.
» ఎన్యూమరేషన్ ఫారం మీద మీ తాజా ఫొటో అంటించి ఫారం పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వాలి.
»ఒకవేళ మీ తరుఫున ఎవరైనా ఈ ఫారాలు అందచేస్తే ఆ ఓటరు మీకు ఏమవుతారు? అనే వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది.
» అలాగే ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తే ఎలాంటి శిక్ష విధిస్తారనే వివరాలు మీకు తెలుసని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి.
ఈ వివరాలు ఇవ్వండి
» ఎన్యూమరేషన్ ఫారంలో ఈ వివరాలు అందరూ సమర్పించాలి.
» ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు (ఇది ఐచ్ఛికం), మొబైల్ నెంబర్, తండ్రి పేరు,
తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటే), తల్లి పేరు, తల్లి ఓటరుకార్డు (అందుబాటులో ఉంటే), జీవిత భాగస్వామి (వర్తిస్తేనే) పేరు, జీవిత భాగస్వామి ఓటరు కార్డు నెంబరు (అందుబాటులో ఉంటేనే) ఇవ్వాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో కూడా ఇవ్వొచ్చు..
» వేరే ప్రాంతాల్లో నివసించే వారు కూడా సొంతంగా ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించే వీలుంది.
» ఇందుకోసం ‘ఈసీఐనెట్’ యాప్‌లో ప్రత్యేకంగా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
» ‘ఈ – సైన్’ ద్వారా ఫారంను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించి ఉండాలి.
» గుర్తింపు కార్డుపై ఉన్న ఓటరు పేరు స్పెల్లింగ్, ఓటరు ఆధార్ కార్డుతో కచ్చితంగా సరిపోవాలి.
» ఏదైనా వ్యత్యాసం ఉంటే డిజిటల్ ఈ – సైన్ విఫలం అవుతుంది.
» అలాంటప్పుడు ఓటర్ తన బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా ఫిజికల్‌గా ఫారం సమర్పించాల్సి ఉంటుంది.
ముసాయిదా జాబితా సరి చూసుకోవడం తప్పనిసరి..
» ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
» ప్రతీ బీఎల్‌వో దగ్గర అది అందుబాటులో ఉంటుంది. లేకపోతే http://www. ceoandhra.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు.
» ముసాయిదా జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతీ ఒక్కరు విధిగా సరి చూసుకోవాలి. ఇదే అత్యంత కీలకం.
» ఒకవేళ ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. కేవలం ఆగస్టు 20 వరకు మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తారు.
» సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.
» అభ్యంతరాలను తెలిపేందుకు మూడు రకాల ఫారాలు అందుబాటులో
ఉంటాయి. జూలై 1లోగా 18 ఏళ్లు నిండి ఇంకా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
» చనిపోయిన లేదా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడానికి ఫారం 7 వాడాలి.
» జాబితాలో ఓటు లేకున్నా లేకపోతే వేరే చోటకి ఓటు బదలాయించాలన్నా, తప్పులున్నా ఫారం 8 ఉపయోగించాలి.
నోటీసులు ఎవరికి ఇస్తారు?
» ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌లో పాక్షిక తేడాలను గుర్తించిన ఓటర్లతో పాటు 2002 ఓటర్ల జాబితాతో తమతో పాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు ఈఆర్వోలు నోటీసులు ఇస్తారు.
» నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిందండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.
నోటీసు ఇస్తే రుజువు చేసుకోవాల్సిందే..
» నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది.
» 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.
» 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/ పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
అజాగ్రత్తగా ఉంటే ఓటు హుళక్కే..
» ఎన్యూమరేషన్ ఫారం అందుకున్నప్పటి నుంచి తుది జాబితా ప్రచురించే సెప్టెంబర్ 22 వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే.
» ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన వారి ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పేరుతో నిజమైన ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉంది.
» ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా మరణించిన వారి పేర్లను, వలస వెళ్లి ఆచూకీ తెలియని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.
» ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఓటు హక్కు ఉంచి మిగిలిన చోట్ల తొలగిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారు తమ ఓటు హక్కును కోల్పోతారు. 2002 ఓటర్ల జాబితాలో లేని వారు నిర్దేశించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించకుంటే వారు కూడా ఓటు హక్కు కోల్పోతారు.


